Lahore, August 10: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ (Pakistan National Assembly) రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చేసిన సిఫార్సు మేరకు ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ అందుకు అంగీకరించారు. గడువుకు కొన్ని గంటల ముందే అక్కడి ప్రభుత్వం రద్దయినట్లయ్యింది.వాస్తవంగా ఆగస్టు 12 వరకు గడువు ఉంది. కాగా త్వరలోనే ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరనుంది.
దీంతో ఎన్నికలను వచ్చే 90 రోజుల్లో పూర్తిచేసేందుకు వెసులుబాటు లభించినప్పటికీ.. ఇవి మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌పై (Imran Khan) ఎన్నికల సంఘం ఐదేళ్ల వేటు వేయడంతో అక్కడి రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం పాక్ జాతీయ అసెంబ్లీ రద్దుకావడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పాలనా వ్యవహారాలు ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్వహించనుంది.
తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు అనుభవిస్తోన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఎన్నికల సంఘం ఐదేళ్ల వేటు వేసింది. అయితే, ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇస్లామాబాద్ హైకోర్టులో ఇమ్రాన్ ఖాన్ అప్పీల్ చేశారు. అక్కడ ఉపశమనం లభించకపోతే.. వచ్చే ఎన్నికలకు ఇమ్రాన్ దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక 76 ఏళ్ల పాకిస్థాన్ చరిత్రలో కేవలం మూడుసార్లు మాత్రమే పాకిస్థాన్ పూర్తిస్థాయి (ఐదేళ్ల) పాలనను నడిపించింది.