Peshawar Bomb Blast: పాకిస్థాన్‌లో బాంబు పేలుడు, 30 మంది మృతి, మరో 50 మందికి గాయాలు, సూసైడ్ అటాక్ జ‌రిగిన‌ట్లు అనుమానాలు
Blast (Photo Credits: Pixabay/ Representational Image)

Lahore, Mar 4: పాకిస్థాన్‌లో పెషావ‌ర్‌లోని ఓ మ‌సీదులో జ‌రిగిన పేలుడులో 30 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. సూసైడ్ అటాక్ జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. లేడీ రీడింగ్ హాస్పిట‌ల్‌కు చెందిన అధికారులు మృత‌దేహాల‌ను గుర్తిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 50 మంది గాయ‌ప‌డిన‌ట్లు తెల‌తుస్తోంది. పెషావ‌ర్ సిటీ పోలీసు ఆఫీస‌ర్ ఇజాజ్ అషాన్ మాట్లాడుతూ తాజా పేలుడులో ఓ పోలీసు అధికారి మృతిచెందిన‌ట్లు చెప్పారు. 30 మృత‌దేహాల‌ను హాస్పిట‌ల్‌కు తీసుకువ‌చ్చిన‌ట్లు లేడీ రీడింగ్ హాస్పిట‌ల్ మేనేజ‌ర్ అసిమ్ ఖాన్ తెలిపారు.

న‌గ‌రంలోని కిస్సా ఖ‌వాని బ‌జార్‌లో ఉన్న మ‌సీదులోకి ఇద్ద‌రు సాయుధులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం చేశారు. అక్క‌డ భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న పోలీసుల‌పై తొలుత వాళ్లు ఫైరింగ్ జ‌రిపారు. ఆ ఘ‌ట‌న‌లో ఓ పోలీసు మృతిచెంద‌గా, మ‌రో పోలీసు గాయ‌ప‌డ్డాడు. కిస్సా ఖ‌వాని బ‌జారులో చాలా షాపులు ఉంటాయి. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల స‌మ‌యంలో ఆ ప్రాంతం అంతా ర‌ద్దీగా ఉంటుంది. లేడీ రీడింగ్ హాస్పిట‌ల్ వ‌ద్ద ప్ర‌స్తుతం అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

మ‌సీదులో జ‌రిగిన ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయ‌ప‌డ్డ వారికి చికిత్స ఏర్పాట్లు చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. సంబంధిత అధికారుల నుంచి పేలుడు ఘ‌ట‌న‌కు చెందిన నివేదిక‌ను ఆయ‌న కోరారు. వాస్త‌వానికి ఇవాళ రావాల్పిండిలో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు రావాల్పిండి వెళ్లాల్సి ఉంది.