Los Angeles, NOV 23: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో (Los Angeles Airport) విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఓ చిన్నపాటి విమానం ల్యాండింగ్ సమయంలో సమస్య ఎదురైంది. అయితే పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. లాస్ ఏంజిల్స్‌లోని వాన్ న్యూస్ ఎయిర్‌పోర్టులో (Van nuys Airport) గతరాత్రి ఓ చిన్నపాటి విమానం ల్యాండింగ్ సమయంలో ముందు ఉండే ల్యాండింగ్ గేర్లు (Landing Gear) తెరుచుకోలేదు. గేర్ లాక్ అవ్వడంతో ఫ్రంట్ టైర్లు ఓపెన్ అవ్వలేదు. దీంతో వెనుక గేర్ల మీదనే విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ (Emergency Landing) చేశారు. ఈ క్రమంలో విమానం ముందు భాగం రన్ వేను ఢీకొట్టింది. దాంతో మంటలు చెలరేగాయి. చాలా దూరం వరకు అలాగే విమానం ముందు భాగంలో నిప్పులు చిమ్మింది. అయితే ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.
WATCH: Plane forced to land without front landing gear at Los Angeles airport pic.twitter.com/Ka90HW3jSD
— BNO News Live (@BNODesk) November 23, 2022
ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్లేన్ కూడా ఎక్కువగా డ్యామేజ్ అవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియోను ఎయిర్ పోర్టు సిబ్బంది ట్వీట్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. ప్రమాదం జరిగిన రెండు గంటల వరకు విమానం రన్ వే మీదనే ఉంది. దాన్ని తొలగించడంతో రాకపోకలు సజావుగా సాగాయి.
సాంకేతిక లోపం కారణంగానే ముందు భాగంలోని గేర్లు తెరుచుకోలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులతో పాటూ ప్లేన్ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.