Pro India Banners in Pakistan: అఖండ భారదేశానికి మద్ధతుగా పాకిస్థాన్‌లో బ్యానర్లు, శివసేన ఎంపీ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన. వాటిని తొలగించి అనుమానితులను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు.
Pro-India banners in Pakistan, in support to Akhand Hindustan

భారత ప్రభుత్వం, కాశ్మీర్ రాష్ట్రాన్ని విభంచి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చటం, దానికి స్వయంప్రతిపత్తిని ఎత్తివేయడం పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే 'పుల్వామా దాడులు' రిపీట్ అవుతాయి అని హెచ్చరికలు చేశారు. ఇక ఆ దేశ పత్రికలు, మీడియా సంస్థలు గత రెండు రోజులుగా భారత్ పై విష ప్రచారం చేస్తున్నాయి. ఇదొక హిందూ - ముస్లిం వివాదంగా చిత్రీకరిస్తున్నాయి. హిందుత్వ భావజాలంతో పనిచేసే భారత్ లోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలపై కక్షగట్టి, ముస్లిం మతస్థులు ఎక్కువగా ఉన్న ఏకైక జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ చర్యకు ఇండియాలో ముస్లిం పార్టీలు మినహా, హిందువుల నాయకత్వంలో నడుస్తున్న మిగతా పార్టీలన్నీ మద్ధతు తెలిపాయి. 50 వేల మంది భద్రత బలగాలను కశ్మీర్ లో దించి, అక్కడ కర్ఫ్యూ విధించి ముస్లింలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. కశ్మీర్ లోని హిందువులు మాత్రం ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తూ సంబరాలు చేసుకుంటున్నారని పాకిస్థాన్ ప్రముఖ జాతీయ పత్రికలన్నీ రాసుకుంటూ పోయాయి.

ఇదిలా ఉండగా, పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్, ఇతర ప్రాంతాలలో 'అఖండ భారత్ వైపు ముందడుగు' అనే హెడ్ లైన్ తో బ్యానర్లు వెలిశాయి. ఇందులో ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్ రావుత్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన ఉంది. వాటి సారాంశం 'ఈరోజు కాశ్మీర్ మనదైంది, రేపు పాక్ ఆక్రమిత కాశ్మీర్, అలాగే బెలుచిస్తాన్ కూడా మనవైపోతాయి. త్వరలోనే అఖండ భారతావని ( విభజనకు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ లతో కూడిన భారత్) కలను మన ప్రధాని సాకారం చేస్తారనే సంపూర్ణ విశ్వాసం నాకుంది'. అని ఉన్న డజన్ల కొద్దీ బ్యానర్లు అక్కడ వెలిశాయి. చాలా సేపటికి ఎవరో ఫిర్యాదు చేస్తే అప్పుడు పాక్ పోలీసులు వచ్చి వాటిని తొలగించారు. అందుకు అనుమానితుడిగా భావించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ బ్యానర్లే కాకుండా వాట్సాప్, ఫేస్ బుల్ లాంటి సోషల్ మీడియాలో సైతం ఇలాంటివి వ్యాప్తి చెందుతాన్నాయని గుర్తించారు.

కాగా, ఆ బ్యానర్ల సారాంశం ఏంటనేది చాలా మందికి అర్థం కాకపోవడంతో వాటిని వెంటనే గుర్తించటానికి వీలుపడలేదని, అందుకే వాటిని తొలగించేందుకు ఆలస్యమైందని అక్కడి మీడియా చెప్పుకొచ్చింది.