Pakistan Election Results 2024: ముగిసిన పాకిస్థాన్ ఎన్నిక‌ల కౌంటింగ్, ఇమ్రాన్ ఖాన్ కు మ‌ద్ద‌తిస్తున్న ఇండిపెండెంట్ల‌దే హ‌వా! 93 స్థానాల్లో గెలిచిన ఇమ్రాన్ మ‌ద్ద‌తుదారులు, అధికారికంగా ప్ర‌క‌టించ‌ని ఎన్నిక‌ల సంఘం
Pakistan Election 2024 (Photo Credit: X/ @ANI)

Islamabad, FEB 11: పాకిస్థాన్‌లో నేషనల్ అసెంబ్లీ (Pak Elections), ప్రావిన్షియల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన మెజారిటీ రాలేదు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (PTI) అధినేత‌ ఇమ్రాన్ ఖాన్‌కు (Imran Khan) మద్దతు ఇస్తున్న స్వతంత్ర అభ్యర్థులు 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. నవాజ్ ష‌రీఫ్ (Nawaz Sharif) సార‌ధ్యంలోని పాకిస్థాన్ ముస్లింలీగ్ – న‌వాజ్ (PMLN) పార్టీ 75 సీట్లతో రెండో స్థానంలో ఉంది. కానీ పాకిస్తాన్ ఎన్నికల సంఘం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నిక‌లు జ‌రిగిన‌ తరువాత 67 గంటలకు అన్ని స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప‌లు సీట్ల‌లో రిగ్గింగ్ జ‌రిగింద‌ని ఇమ్రాన్ ఖాన్ సార‌ధ్యంలోని పీటీఐ, బిలావల్ భుట్టో ఆధ్వ‌ర్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆరోపించాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్ల‌కు 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఒక సీటు NA-88 ఫలితాలు తిరస్కరించటంతో, అక్కడ ఫిబ్రవరి 15న మళ్లీ ఓటింగ్ జరగనుంది. మిగిలిన 70 సీట్లు రిజర్వ్ చేశారు.

 

పాకిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే పాక్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో 134 స్థానాల్లో మెజారిటీ అవసరం. పాకిస్థాన్‌లో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ ఉంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PMLN), పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ,పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) పోటీ ప‌డుతున్నాయి. మొత్తం 264 జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స్థానాల్లో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ మద్దతుదారులు 93, ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి 75, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లు గెలుచుకున్నాయి.