New Delhi, Feb 24: ఉక్రెయిన్- రష్యా యుద్ధం (Russia-Ukraine War) నేపథ్యంలో...శాంతి నెలకొల్పేందుకు ప్రపంచదేశాలు రంగంలోకి దిగుతున్నాయి. రష్యాతో (Russia) మంచి సంబంధాలు ఉన్న భారత్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఫోన్ లో మాట్లాడారు(PM Modi speaks to Putin). ఉక్రెయిన్‌పై సైనిక దాడికి తక్షణం స్వస్తి పలుకాలని కోరారు. ఉక్రెయిన్‌పై హింసకు తెర దించాలని సూచించారు. అదేవిధంగా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ (Ukraine)లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్లొన్నారు. ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ కూడా పాల్లొన్నారు. ఇక మరోవైపు ఉక్రెయిన్ విషయంలో ప్రపంచ దేశాలు మాట్లాడకూడదని, జోక్యం చేసుకోకూడదని పుతిన్ అన్ని దేశాలకు ముక్కు సూటిగా చెప్పేశారు.
PM Narendra Modi speaks to Russian President Vladimir Putin
Pres Putin briefed PM about the recent developments regarding Ukraine. PM reiterated his long-standing conviction that the differences between Russia & NATO can only be resolved through honest and sincere dialogue: PMO
— ANI (@ANI) February 24, 2022
భారత్ కు రష్యా చాలా కాలంగా మిత్రదేశంగా కొనసాగుతోంది. కేవలం భారత్ మాత్రమే కాదు, రష్యాతో దగ్గరి సంబంధాలు ఉన్న అన్ని దేశాల నేతలు...యుద్ధం వద్దని వారిస్తున్నారు. అటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం...రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. బైడెన్ తో పాటూ, బ్రిటన్, జర్మనీ దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాల కూటమి నాటో కూడా రష్యా చర్యను తప్పుబట్టింది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు, సహజ వాయువు, బంగారం ధరలు పైపైకి దూసుకెళ్లాయి. మరికొద్దిరోజులు ఇదే పరిస్థితి నెలకొంటే, కరోనా సమయం నాటి ఆర్ధిక సంక్షోభాన్ని మరోసారి ప్రపంచదేశాలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశముంది. అయితే మిత్రదేశాల సూచనలను రష్యా అధ్యక్షుడు ఏ మేరకు పట్టించుకుంటారో చూడాలి!
ఉక్రెయిన్‌లోని రెండు తూర్పు ప్రాంతాలు ప్రకటించుకున్న స్వాతంత్య్రాన్ని గుర్తిస్తున్నట్లు తొలుత ప్రకటించిన పుతిన్.. గురువారం ఉదయం సైనిక దాడి చేపట్టారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తోపాటు పలు నగరాలపై క్షిపణుల వర్షం కురిపించింది రష్యా సైన్యం. 70కి పైగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ తమలో కలిసి పోవాల్సిందేనని స్పష్టం చేసింది.