US National Security Council's Strategic Communications Coordinator, John Kirby (Photo Credits: X/@stairwayto3dom)

Washington, May 29: రఫా (Raffah) నగరంలో ఇజ్రాయెల్‌ (Israel) ఆదివారం జరిపిన దాడులను అగ్రరాజ్యం అమెరికా (USA) ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం (US Condemns IDF Strike) వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని, చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని పేర్కొంది. ‘రఫాలో ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో పౌరులు మరణించిన దృశ్యాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే హృదయం తరుక్కుపోతోంది. చాలా భయానకంగా ఉన్నాయి. హమాస్‌తో (hamas) జరుగుతున్న ఈ పోరులో సామాన్యులకు ఎలాంటి హాని జరగొద్దు. హమాస్‌కు బుద్ధిచెప్పే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. అయినప్పటికీ అది సామాన్య పౌరులకు ఎలాంటి ముప్పు తలపెట్టొద్దు. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హమాస్‌ పెద్ద తలకాయల్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. అదే సమయంలో పౌరుల ప్రాణాలు కూడా ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి’ అని వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలి వ్యూహాత్మక సమాచార విభాగం సమన్వయకర్త జాన్‌ కిర్బీ పేర్కొన్నారు.

 

రఫాలో భూతల దాడులు (IDF Strike in Rafah) అవసరం లేదని తాము భావిస్తున్నామని కిర్బీ అభిప్రాయపడ్డారు. దీనిపై నిరంతరం ఇజ్రాయెల్‌తో చర్చలు జరుపుతున్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు రఫాలో ఇజ్రాయెల్‌ దాడి తర్వాత కూడా ఆ దేశం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) విధానంలో ఎలాంటి మార్పు లేదని వైట్‌హౌజ్‌ స్పష్టం చేసింది. దాంతో ఇజ్రాయెల్‌ విషయంలో అమెరికా నిర్దేశించుకున్న హద్దులు ఇంకా ఆ దేశం మీరలేదనే విషయం వెల్లడవుతోందని నిపుణులు అంటున్నారు.