New Delhi, JAN 11: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వైరస్ (Covid-19) వ్యాప్తి చెందుతూనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ వైరస్ (Corona Virus) పెద్ద ముప్పుగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ఒక్క డిసెంబరు నెలలోనే కొవిడ్ వల్ల 10వేలమంది మరణించారని (COVID-19 deaths) డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. క్రిస్మస్ సెలవుల కాలంలో కొవిడ్ జేఎన్ 1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందింది. కొవిడ్ వైరస్ ఇంకా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిచెందుతూనే ఉందని, ఈ వైరస్ వల్ల నవంబరు నెలలో ఆసుపత్రుల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరిన వారి శాతం 42 నుంచి 62 శాతానికి పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. కొవిడ్ వైరస్ అమెరికా, యూరప్ దేశాల్లో అధికంగా ప్రబలిందని టెడ్రోస్ పేర్కొన్నారు.
కొవిడ్ వైరస్ పట్ల అన్ని దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. ఒక్క డిసెంబరు నెలలోనే 10వేల కొవిడ్ మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్ పరీక్షలు, చికిత్సలు, వ్యాక్సిన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని టెడ్రోస్ ప్రభుత్వాలను కోరారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్ టీకాలు వేయించుకోవాలని, కొవిడ్ పరీక్షలు చేయించుకోవడంతోపాటు ముందుజాగ్రత్తగా మాస్కులు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సూచించారు. 2019వ సంవత్సరం చివరలో చైనాలోని వుహాన్‌లో కోవిడ్ వైరస్ మొదటిసారిగా కనుగొన్నారు. అనంతరం మూడు సంవత్సరాల గడిచిన తర్వాత 2023వ సంవత్సరం మే నెలలో అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా కొవిడ్-19కి ముగిసినట్లు టెడ్రోస్ ప్రకటించారు. కొవిడ్ వైరస్ పై నిఘా వేసి సీక్వెన్సింగ్ నిర్వహించాలని టెడ్రోస్ ప్రపంచ దేశాలకు సూచించారు.