Saipan, June 26: మిలిటరీ రహస్య పత్రాలను రిలీజ్ చేసిన కేసులో వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే (Julian Assange) అమెరికాతో (America) ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిలో భాగంగా ఇవాళ మారియానా దీవుల్లో ఉన్న కోర్టుకు ఆయన హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం.. అసాంజే విముక్తి (Julian Assange Now a Free Man) అయ్యారు. ఆయన స్వేచ్ఛగా కోర్టు నుంచి బయటకు వచ్చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న న్యాయపోరాటం ముగిసింది. ఇన్నాళ్లూ బ్రిటన్ జైలులో ఉన్న అసాంజే.. నిన్ననే అమెరికా కోర్టుకు వెళ్లారు. అయితే అమెరికా కోర్టు అసాంజేకు (Julian Assange) తాజాగా ఎటువంటి శిక్షను విధించలేదు. దీంతో ఆయన తన స్వంత దేశం ఆస్ట్రేలియాకు పయనం అవుతున్నారు. మిలిటరీ సమాచారాన్ని లీక్ చేసిన కేసులో అసాంజే తీవ్రమైన జైలు శిక్షను లండన్‌లో అనుభవించారు. దేశద్రోహం కేసులో అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అసాంజే కోర్టును ఆశ్రయించారు. బ్రిటన్ జైలులో అసాంజే అయిదేళ్లు శిక్షను అనుభవించారు. అంతకుముందు ఆయన ఈక్వడార్ ఎంబసీలో ఏడేళ్లు గడిపారు. అసాంజే రిలీజ్ పట్ల ఆయన భార్య స్టెల్లా సంతోషం వ్యక్తం చేశారు.
దాదాపు 14 ఏళ్ల తర్వాత అసాంజే ఫ్రీ అయ్యారు. ఆస్ట్రేలియాలోని క్యాన్‌బెరాకు అసాంజే ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 14 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత అసాంజే తన స్వంత ఇంటికి స్వేచ్ఛగా వెళ్తున్నారని ఆయన తరపున వాదించిన లాయర్ జెన్ రాబిన్‌సన్ తెలిపారు. అసాంజే విముక్తి కావడం.. భావ స్వేచ్ఛ కేసులో విజయం సాధించినట్లే అని ఆయన తరపున లీగల్ టీమ్ పేర్కొన్నది. మీడియా స్వేచ్ఛ, జాతీయ భద్రత లాంటి అంశాలపై అసాంజే కేసు కీలకంగా మారినట్లు రాబిన్‌సన్ వెల్లడించారు.అసాంజే రిలీజ్‌కు సహకరించిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆమె థ్యాంక్స్ తెలిపారు.
అసాంజే రిలీజ్‌పై అమెరికా న్యాయశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అమెరికాతో కుదిరిన ఒప్పందంపై చాలా వివరణాత్మకంగా ఆ నోట్‌లో రాశారు. అయితే ఎటువంటి అనుమతి లేకుండా అసాంజే అమెరికాలో ప్రవేశించరాదు అని నిషేధం విధించారు. అయితే ఆ ఆంక్షలపై క్షమాభిక్ష కోరనున్నట్లు స్టెల్లా అసాంజే తెలిపారు. అమెరికా నేలపై ఎటువంటి ఆంక్షలు లేకుండా కాలు మోపేందుకు అనుమతి తీసుకోనున్నట్లు ఆమె చెప్పారు.