
Washington January 08: కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని ఒమిక్రాన్(Omicron) వణికిస్తున్నది. కొత్త వేరియంట్ (New variant)కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల(Daily Covid Cases) నమోదు 20 లక్షలు దాటింది. జనవరి 1 నుంచి శనివారం వరకు కొత్త ఏడాది తొలి వారంలో సగటున 21,06,118 రోజువారీ కరోనా కేసులు నమోదయ్యాయి. 2021 డిసెంబర్ 23-29 వారంలో ఈ సంఖ్య పది లక్షల మేర ఉండగా, వారం రోజుల్లో పాటిజివ్ కేసులు(Corona Cases) రెట్టింపయ్యాయి.
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో కొత్త కేసుల నమోదు 270 శాతం మేర పెరిగింది. ప్రధానంగా యూరప్(Europe), అమెరికా- కెనడా(Canada) వరల్డ్ ఇన్ఫెక్షన్ హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. గత వారం ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో ఈ రెండు ప్రాంతాలు నుంచే 49 శాతం, 33 శాతం మేర కరోనా కేసులు ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఐరోపాలో కోవిడ్ కేసులు 47 శాతం, యునైటెడ్ స్టేట్స్-కెనడాలో 76 శాతం పెరిగాయి. అదే సమయంలో, ఓషియానియాలో 224 శాతం, లాటిన్ అమెరికా, కరేబియన్‌లలో 148 శాతం, మధ్యప్రాచ్యంలో 116 శాతం, ఆసియాలో 145 శాతం మేర కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరిగాయి.
మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య మాత్రం అదుపులోనే ఉన్నది. జనవరి 1 నుంచి 7 వరకు నిత్యం సగటున 6,237 మరణాలు నమోదయ్యాయి. 2020 అక్టోబర్ నాటి కనిష్ఠ స్థాయిలో ఈ సంఖ్య ఉండటం ఊరటనిస్తున్నది. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ వల్ల స్వల్ప లక్షణాలే ఉంటున్నప్పటికీ, కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముండటంతో ఆరోగ్య వ్యవస్థలపై ఇది ప్రభావం చూపవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.