Mahindra Bolero Maxx Pik-Up (Photo Credit; Official Website)

Bolero MaXX Pik-Up: భారతీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా తమ బ్రాండ్ నుంచి వాణిజ్య వాహనాల విభాగంలో మరొక వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఎయిర్ కండిషనింగ్‌తో మహీంద్రా బొలెరో MaXX పిక్-అప్ ట్రక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త పికప్ వాహనం డీజిల్ లేదా CNG వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఎక్స్- షోరూమ్ వద్ద ఈ పికప్ వాహనం ధరలు రూ. 8.49 లక్షల నుండి రూ. 11.22 లక్షల వరకు ఉన్నాయి.

Bolero MaXX Pik-Up వాహనం యొక్క కొత్త ట్రిమ్ ఇప్పుడు మెరుగైన బిల్ట్ క్వాలిటీ, సేఫ్టీ ఫీచర్‌లతో వచ్చింది. డ్రైవర్‌కు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఆస్వాదించడానికి ఇది అధునాతన ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

Mahindra Bolero MaXX Pik-Up వాహనం ఇంధన సామర్థ్యం

బొలెరో మాక్స్ పిక్-అప్ వాహనాల శ్రేణిలో m2Di ఇంజిన్‌తో ఆధారితమైనవి. వీటి ఇంజన్ 70 bhp శక్తిని 200Nm టార్కును ఉత్పత్తి చేస్తాయి. టాప్-ఎండ్ వెర్షన్ ఇంజన్ 79 bhp శక్తిని 220Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం 1.3 టన్నుల నుండి 2 టన్నుల వరకు భారాన్ని మోయగలదు, దీని కార్గో బెడ్ పొడవు 3050 mm వరకు ఉంటుంది.

ఫీచర్లపరంగా ఇందులో అగ్రెసివ్ యాక్సిలరేషన్ అలర్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, షార్ప్ కార్నరింగ్, ఇంధనం వాడకంపై నిఘా మొదలైన అంశాలతో పాటు, సౌలభ్యం కోసం ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్లు, టర్న్-సేఫ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన ఇంటీరియర్స్ , బ్రాండ్ హీటర్ మరియు డిమిస్టర్‌తో కూడిన ఎయిర్ కండిషనింగ్‌ ఉన్నాయి. సరికొత్త బొలెరో మాక్స్ పిక్-అప్ వాహనంలో అందించిన ఫీచర్లు వాహనం భద్రతను, సామర్థ్యాన్ని నిర్ధారిస్తాయి.

వ్యాపార- వాణిజ్య అవసరాలు ఉన్నవారికి మహీంద్రా బొలెరో MaXX పిక్-అప్ ట్రక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆసక్తి ఉన్నవారు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ అధీకృత డీలర్‌షిప్ నుండి ఈ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.