2024 Bajaj Pulsar NS 160 and NS200 | Official website photo

Bajaj Pulsar NS 160 - NS 200: భారతీయ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో తమ బ్రాండ్ నుంచి పాపులర్ ద్విచక్రవాహనమైన పల్సర్ బండికి అప్‌డేట్‌ వెర్షన్ అయిన పల్సర్ NS మోడల్‌లను విడుదల చేసింది. బజాజ్ పల్సర్ NS160 మరియు బజాజ్ పల్సర్ NS200 పేర్లతో వచ్చిన ఈ రెండు రెండు మోటార్‌సైకిళ్లు వేరియంట్లు ఇప్పుడు మరింత స్టైలింగ్ డిజైన్‌తో, మార్కెట్‌లోని పోటీదారులతో సమానంగా సరికొత్త ఫీచర్ అప్‌డేట్‌లను పొందాయి.

2024 బజాజ్ పల్సర్ NS మోడల్‌ డిజైన్, ఫీచర్లు

బజాజ్ పల్సర్ NS160 మరియు పల్సర్ NS200లలో సరికొత్త LED హెడ్‌లైట్ సెటప్‌ను అందించారు. హెడ్‌లైట్ మునుపటిలాగే కనిపిస్తున్నప్పటికీ, లోపల LED DRLల సెట్‌తో రిఫ్రెష్ చేయబడ్డాయి. ఎన్‌ఎస్ సిరీస్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాబట్టి ఈ బైక్‌లకు ఇది కొత్త డిజైన్ ఎలిమెంట్ అనే చెప్పాలి. 2024 బజాజ్ పల్సర్ NS మోడల్‌లలో ఫ్యూయల్ ట్యాంక్‌తో పాటు ప్యానెల్‌లపై పదునైన కట్‌లతో కూడిన దృఢమైన డిజైన్‌ ఎప్పట్లాగే ఉంది.

ఇక, ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కొత్త మోటార్‌సైకిళ్లు డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ డిస్‌ప్లే రెవ్ కౌంటర్, స్పీడోమీటర్ , ఇంధనం వంటి సూచికలను చూపుతాయి. అంతేకాకుండా లేటెస్ట్ పల్సర్ బైక్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా పొందుతుంది. అందువల్ల, రైడర్ ఇప్పుడు కాల్ మరియు SMS నోటిఫికేషన్‌లను పొందవచ్చు.

బజాజ్ పల్సర్ NS160 మరియు NS200 రెండింటిలో ముందువైపు USD ఫోర్క్‌లు, వెనుక మోనో-షాక్‌ను కలిగి ఉన్నాయి. బ్రేకింగ్ వ్యవస్థలో రెండు చక్రాలకు ABS తో కూడిన డిస్క్‌లను ఇచ్చారు. ఈ యూనిట్లు 17-అంగుళాల చక్రాలపై అమర్చబడి ఉంటాయి.

2024 Bajaj Pulsar NS ఇంజన్ సామర్థ్యం

బజాజ్ పల్సర్ NS160లో 160.3 cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఇంజన్ 17.03bhp మరియు 14.6 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు NS200లో 199cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఈ ఇంజన్ 24.13 bhp మరియు 18.74 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో పల్సర్ NS160 మైలేజీ లీటరుకు 45 కిమీ ఇస్తుండగా, పల్సర్ NS200 మైలేజీ లీటరుకు 35 కిమీగా ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి.

ధరలు:

ఢిల్లీ ఎక్స్-షోరూమ్ వద్ద 2024 బజాజ్ పల్సర్ NS160 ధర రూ. 1.46 లక్షలు కాగా, పల్సర్ NS200 రిటైల్ ధర రూ. 1.57 లక్షలు. మార్కెట్లో పల్సర్ NS160 బైక్.. TVS Apache RTR 160 4V, Hero Xtreme 160R లకు ప్రత్యర్థిగా ఉంటుంది, అయితే పల్సర్ NS200 బైక్ మాత్రం TVS Apache RTR 200 4V, హోండా హార్నెట్ 2.0 మొదలైన వాటితో పోటీపడుతుంది.