Hyundai i20 sportz (O): దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీదారు హ్యుందాయ్ తమ బ్రాండ్ నుంచి పాపులర్ మోడల్ అయిన i20లో మరొక వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. i20 sportz (O) పేరుతో ఈ కారును లాంచ్ చేసింది, దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 8.73 లక్షలుగా పేర్కొంది. ఈ కొత్త వేరియంట్, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది సింగిల్ , డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లను కూడా అందిస్తుంది. డ్యూయల్-టోన్ ఆప్షన్ ధర స్వల్పంగా ఎక్కువ రూ. 8.88 లక్షలకు దీనిని విక్రయించనున్నారు.
అయితే, ఇప్పటికే ఉన్న i20 sportz కారుకు, తాజాగా విడుదల చేసిన వేరియంట్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేసిన స్పోర్ట్జ్ వేరియంట్ రూ. 35 వేలు ధర ఎక్కువగా ఉంది. ఈ అదనపు ధరలో మూడు కొత్త ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా వైర్‌లెస్ ఛార్జర్, డోర్ ఆర్మ్‌రెస్ట్‌పై లెథెరెట్ ఫినిషింగ్ మరియు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సన్‌రూఫ్ ఇస్తున్నారు. ఇక కారు యాంత్రికపరంగా, మిగతా ఫీచర్లపరంగా పాత వేరియంట్‌కు సమానంగానే ఉంటుంది.
i20 sportz (O) ఇంజన్ సామర్థ్యం
సరికొత్త హ్యుందాయ్ స్పోర్ట్జ్ (O) వేరియంట్ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది, ఇది 82 hp మరియు 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్ ను 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
కొత్త స్పోర్ట్జ్ (O) చేరికతో i20 కారు ఇప్పుడు మొత్తంగా ఆరు వేరియంట్లలో లభించనుంది. మిగతా వేరియంట్లను పరిశీలిస్తే ఐ20 ఎరా, ఐ20 మాగ్నా, ఐ20 స్పోర్ట్జ్, ఐ20 ఆస్టా మరియు ఐ20 ఆస్టా (O) ఉన్నాయి. ఈ ఐ20 కారు ధరలు రూ. 7.04 లక్షల నుంచి ప్రారంభమై రూ. 11.21 లక్షల వరకు ఉన్నాయి.
హ్యుందాయ్ కార్లకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్ క్రెటా వంటి మిడ్‌సైజ్ SUVలు, కొత్తగా విడుదల చేసిన ఎక్స్‌టర్ కాంపాక్ట్ SUV కారణంగా సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. 2024 జనవరిలో రికార్డ్-బ్రేకింగ్ హోల్‌సేల్ నంబర్‌లతో ప్రారంభించింది. ఈ ఒక్క నెలలోనే 57,118 కార్ల విక్రయాన్ని హ్యుందాయ్ నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే 14 శాతం వృద్ధిని సాధించింది. ఈ క్రమంలో సేల్స్ మరింత పెంచుకోవడానికి హ్యుందాయ్ కంపెనీ వివిధ మోడళ్లలో ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంది.