NATRAX HST | Photo: Twitter

Indore, June 30: ఆటోమొబైల్ అనుబంధ రంగంలో ఇండియా మరో మైలురాయిని చేరుకుంది. అన్ని రకాల అగ్రశ్రేణి వాహనాల సామర్థ్య పరీక్ష కోసం 'నాట్రాక్స్- ది హై స్పీడ్ ట్రాక్'  (NATRAX- the High Speed Track(HST) ను కేంద్ర భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మధ్యప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధాని అయిన ఇండోర్‌లో ప్రారంభించారు.

ప్రపంచ స్థాయిలో నిర్మించిన 11.3 కిలోమీటర్ల హై స్పీడ్ ట్రాక్‌ ఆసియాలోనే అతి పొడవైన ట్రాక్ కాగా, ప్రపంచంలో ఐదవ ర్యాంకులో ఉంది. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేశారు. ద్విచక్ర వాహనాల నుంచి భారీ ట్రక్కుల వరకు, అన్ని రకాల వాహనాలకు అన్ని రకాల గరిష్ట వేగ పరీక్షలను ఒకేచోట చేసే కేంద్రంగా ఇది నిలుస్తుంది. ఆటోమొబైల్స్ మరియు విడిభాగాల తయారీ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్ అవతరిస్తోందని ఈ సందర్భంగా మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

"ఆత్మనిర్భర్ భారత్ వైపు మనం వేగంగా అడుగులేస్తున్నాం. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశం వాహన తయారీ కేంద్రంగా మారాలన్న ప్రధాని కలను నెరవేర్చడానికి మా మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. వాహన, ఉత్పాదక పరిశ్రమల అభివృద్ధి ఉద్యోగ కల్పనలో సాయం చేస్తుంది" అని చెప్పారు.

రైల్వేలు, ప్రధాన రహదారులు, జలమార్గాల్లో ఏళ్ల తరబడి నానుతున్న ప్రాజెక్టులు, తమ ప్రభుత్వ బలమైన రాజకీయ సంకల్పం వల్ల ఇప్పుడు పూర్తవుతున్నాయని మంత్రి జవదేకర్ తెలిపారు.

కొత్తగా ప్రారంభించబడిన నాట్రాక్స్‌ కేంద్రం 'వెహికల్‌ డైనమిక్స్'కు ఒక 'సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌'. ఇక్కడ వాహనల గరిష్ట వేగం, ఆక్సిలరేషన్‌, స్థిరమైన వేగ ఇంధన వినియోగం, రియల్ రోడ్ డ్రైవింగ్ సిమ్యులేషన్ ద్వారా ఉద్గార పరీక్షలు, గరిష్ట వేగ నిర్వహణ, లేన్ మార్పు, అధిక వేగ మన్నిక వంటి పరీక్షల సమయంలో అధిక వేగ నిర్వహణ, స్థిరత్వ మూల్యాంకనం వంటి పరీక్షలను నిర్వహిస్తారు.

Watch Video:

బీఎంమ్‌డబ్ల్యూ, మెర్సిడెజ్‌, ఆడి, ఫెరారీ, లాంబోర్ఘిని, టెస్లా వంటి ఖరీదైన కార్ల గరిష్ట వేగ సామర్థ్యాన్ని గణించడానికి ఈ ట్రాక్ ను ఉపయోగిస్తారు. భారత్‌లోని మరే ట్రాక్‌లోను వీటి వేగ సామర్థ్యాన్ని కొలవలేం. మధ్యప్రదేశ్‌ మధ్యలో ఇది ఉన్నందున, ఎక్కువ 'ప్రధాన విడి భాగాల తయారీదారులకు అందుబాటులో ఉంటుందని. భారదేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రోటోటైప్ కార్ల అభివృద్ధి కోసం విదేశీ తయారీ సంస్థలు ఇప్పుడు నాట్రాక్స్ హెచ్‌ఎస్‌టీపై దృష్టి పెడతాయి. ప్రస్తుతం, వాహన గరిష్ట వేగ పరీక్షల కోసం విదేశాల్లో ఉన్న తమ హై స్పీడ్ ట్రాక్‌లకు విదేశీ తయారీ సంస్థలు వెళుతున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

అన్ని రకాల వాహనాల గరిష్ట వేగ సామర్థ్య పరీక్షలకు ఏక కేంద్ర పరిష్కారం ఈ ట్రాక్‌. ప్రపంచ పొడవైన ట్రాకుల్లో ఒకటి. ద్విచక్ర వాహనాల నుంచి భారీ వాహనాల వరకు విస్తృత శ్రేణి వాహనాల అవసరాలను ఇది తీర్చగలదు. స్టీరింగ్ నియంత్రణతో, వంపుల వద్ద కూడా గరిష్టంగా 375 కిలోమీటర్ల వేగాన్ని ఈ ట్రాక్‌పై సాధించవచ్చు. ఇది ప్రపంచ స్థాయి సురక్షితమైన పరీక్ష ట్రాక్‌లలో ఒకటి.