Kawasaki Z650RS: జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్రవాహన తయారీదారు కవాసికి భారత మార్కెట్లో తమ బ్రాండ్ బైక్ మోడళ్ల లైనప్‌ను విస్తరించేందుకు ప్రణాళిక చేస్తోంది. ఇందులో భాగంగా, బైక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త మోటార్ సైకిల్ 'కవాసకి Z650RS' ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. పాత మోడళ్లతో పోలిస్తే కవాసకి Z650RS బైక్ 2024 ఎడిషన్ అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. తాజాగా విడుదల చేసిన మోడల్‌లో అదనంగా ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్‌ని చేర్చింది. తద్వారా ఈ బైక్ నడిపే రైడర్‌లకు ఎలాంటి పరిస్థితులలోనైనా మెరుగైన కంట్రోల్ లభిస్తుంది, ఇది వారి భద్రతను మరింత పెంచుతుంది.
ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ రెండు విభిన్న మోడ్‌లను అందిస్తుంది. మొదటి మోడ్, మోడ్ 1, ట్రాక్షన్‌ను ఆప్టిమైజ్ చేయడం ద్వారా దూకుడు పరిస్థితులలో సున్నితమైన కార్నర్ నిష్క్రమణలకు సహకరిస్తుంది, రెండవ మోడ్, మోడ్ 2లో, తడి నేలలపై వీల్ స్లిప్‌ను తగ్గించడానికి సహకరిస్తుంది.
పనితీరును పెంచిన అప్‌గ్రేడ్‌లు, అదనపు ఫీచర్ల కారణంగా 2024 కవాసకి Z650RS మోటార్ సైకిల్ గత మోడళ్ల కంటే రూ. 7 వేలు ఖరీదైనది. ఈ క్రమంలో కవాసకి Z650RS 2024 ఎడిషన్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 6.99 లక్షలుగా ఉంది. ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ ఎబోనీ లేదా మెటాలిక్ మ్యాట్ కార్బన్ గ్రే కలర్ స్కీమ్‌లో లభ్యం కానుంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మరిన్ని కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Kawasaki Z650RS డిజైన్ - ఫీచర్లు
కవాసకి Z650RS మోటార్ సైకిల్ డిజైన్ ఈ బ్రాండ్ లోని మునుపటి మోడల్ Z900RS బైక్ నుండి ప్రేరణ పొందినట్లుగా ఉంది. టైమ్‌లెస్ నియో-రెట్రో డిజైన్‌తో మొదటి చూపులోనే చూపరులను ఆకట్టుకుంటుంది. ఐకానిక్ టియర్‌డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్, సొగసైన సింగిల్-పీస్ సీటు, వృత్తాకార LED హెడ్‌ల్యాంప్, ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి అంశాలు ఆధునిక ఆవిష్కరణలతో క్లాసిక్ సౌందర్యాన్ని మిళితం చేసినట్లుగా ఉంటుంది.
ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ , వెనుక భాగంలో ప్రీలోడ్-అడ్జస్టబుల్ లింక్ సిస్టమ్‌తో ఏకరీతి యాంత్రిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందువైపు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, వెనుకవైపు ఒకే డిస్క్ బ్రేక్ ఉన్నాయి, దీనికి డ్యూయల్-ఛానల్ ABS మద్దతు ఉంది.
Kawasaki Z650RS ఇంజన్ సామర్థ్యం
కవాసకి Z650RS లో 649cc సమాంతర-ట్విన్ ఇంజన్‌ను అమర్చారు, దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. దీని ఇంజన్ 67 BHP వద్ద 8,000 rpm మరియు 64 Nm టార్కు వద్ద 6,700 rpm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్‌హౌస్ థ్రిల్లింగ్ యాక్సిలరేషన్, 2-మోడ్ కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (KRTC) ద్వారా రైడర్‌లు ఎలాంటి రహదారులలోనైనా మెరుగైన స్థిరత్వం, నమ్మకంతో దూసుకుపోవచ్చు.