Komaki Cat 2.0 NXT: డెలివరీ ఆపరేటర్ల కోసం అందుబాటు ధరలో ప్రత్యేకమైన టూవీలర్, కొమాకి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్‌ భారత మార్కెట్లో విడుదల, 350 కేజీలను అవలీలగా మోయగలదు, దీని ధర ఎంతంటే?
Komaki Cat 2.0 NXT e-moped | Pic- Komaki EVs official

Komaki Cat 2.0 NXT :  దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కొమాకి తాజాగా 'క్యాట్ 2.0 NXT' అనే పేరుతో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.  ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధర రూ.99,500/- గా ఉంది.

ఈ మోపెడ్‌ మోడల్‌ను డెలివరీ ఆపరేటర్ల కోసం ప్రత్యేకంగా కంపెనీ రూపొందించింది. ఇది ఒక దృఢమైన ఇనుప ఫ్రేమ్ మరియు కన్వర్టిబుల్ సీటింగ్‌ను కలిగి ఉంది. దీని వెనక సీటును పిలియన్ రైడర్ కోసం ఉపయోగించవచ్చు లేదా అవసరమైనప్పుడు సరుకును మోసే లోడర్‌గా మార్చవచ్చు.

ఈ మోపెడ్‌లో BLDC హబ్ మోటారు అమర్చబడింది , ఇది గరిష్టంగా 350 కిలోల వరకు లోడ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అంటే, మూడున్నర క్వింటాళ్ల బరువును సైతం ఈ మోపెడ్ అవలీలగా లాగగలదు.

Komaki Cat 2.0 NXT బ్యాటరీ సామర్థ్యం

Cat 2.0 NXT మోపెడ్‌లో  42 Ah సామర్థ్యం కలిగిన LiPO4 బ్యాటరీని అమర్చారు, ఇది ఫుల్ ఛార్జ్ మీద సుమారు 110 కిమీ నుండి 140 కిమీల పరిధిని అందించగలదు. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ గంటకు  79 kmph  గరిష్ట వేగంతో ప్రయాణించగలదు. దీని బ్యాటరీ కోసం పోర్టబుల్ ఛార్జర్ కూడా అందిస్తున్నారు, ఇది నాలుగు నుండి ఐదు గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుంది.

ఫీచర్ల పరంగా క్యాట్ 2.0 NXTలో ముందువైపు LED లైట్లు, BLDC హబ్ మోటార్, పార్కింగ్ అసిస్ట్,  రివర్స్ అసిస్ట్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, ఫోల్డబుల్ బ్యాక్‌రెస్ట్, అదనపు స్టోరేజ్, సేఫ్టీ గార్డ్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, వైర్‌లెస్ అప్‌డేట్‌లు, USB ఛార్జింగ్ పోర్ట్, అదనపు ఫుట్‌రెస్ట్‌లు మొదలైన  ఫీచర్‌లను కలిగి ఉంది. ఇది బరువులు మోసే ద్విచక్రవాహనం కాబట్టి వెనక వైపు ఆరు హైడ్రాలిక్ సస్పెన్షన్‌లను అందిస్తున్నారు. తద్వారా సరుకు మోసుకెళ్లేటపుడు రైడ్ సౌకర్యవంతంగా ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,500/- గా ఉంది. అయితే ఏప్రిల్ 30, 2024 లోపు కొనుగోలు చేసేవారికి  రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్  అందుబాటులో ఉంటుంది.