Mahindra Thar Earth Edition: భారతీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా ఇటీవలే స్కార్పియోలో ఎన్ జెడ్8 సెలెక్ట్ వేరియంట్‌ను ప్రవేశపెట్టగా, ఇప్పుడు థార్ వాహనానికి కూడా మరొక కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. మహీంద్రా 'ఎర్త్ ఎడిషన్' పేరుతో థార్ ప్రత్యేక ఎడిషన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వాస్తవానికి థార్ అంటే భారతదేశంలో ఒక ఎడారి పేరు అని అందరికీ తెలిసిందే. మహీంద్రా కంపెనీ కూడా తమ బ్రాండ్ నుంచి ఒక వాహనానికి థార్ అనే పేరు పెట్టుకుంది. ఇప్పుడు ఈ పేరును మరింత సార్థకం చేసేలా ఈ సరికొత్త మహీంద్రా థార్ 'ఎర్త్ ఎడిషన్' ఉండనుంది. అందుకు తగినట్లుగా దీని కలర్ కూడా ఇసుక రంగును పోలినటువంటి శాటిన్ మ్యాట్ 'డెసర్ట్ ఫ్యూరీ' కలర్ ఆప్షన్‌లో అందిస్తున్నారు.
థార్ SUV దాని ప్రామాణిక వెర్షన్‌తో పోల్చినప్పుడు ఎర్త్ ఎడిషన్ డిజైన్ పరంగా ప్రత్యేకమైన కాస్మెటిక్ మార్పులను పొందింది. దీని ఇంటీరియర్ లేత లేత గోధుమరంగు టోన్‌లతో బ్లాక్ థీమ్‌లో ఇచ్చారు. హెడ్‌రెస్ట్‌లపై డూన్ డిజైన్‌లతో కూడిన లేత గోధుమరంగు లెథెరెట్ సీట్లు, AC వెంట్‌లపై డెసర్ట్ ఫ్యూరీ ఇన్‌సర్ట్‌లు, స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్ యాక్సెంట్, 7D ఫ్లోర్ మ్యాట్‌లు , కంఫర్ట్ కిట్, డోర్‌లపై థార్ బ్రాండింగ్ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి థార్ ఎర్త్ ఎడిషన్ సీరియల్ నంబర్ 1తో ప్రారంభమయ్యే ప్రత్యేకమైన VIN ప్లేట్‌తో వస్తుంది.
Mahindra Thar Earth Edition ఇంజన్ సామర్థ్యం
మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ కూడా ప్రామాణిక మోడల్ లో ఉన్నటువంటి అదే ఇంజన్‌ను కలిగి ఉంటుంది. థార్ ఎర్త్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే రెండింటిలో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తున్నాయి. డీజిల్ వెర్షన్ 2.2 లీటర్ ఇంజన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది 130 BHP శక్తిని 300 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు పెట్రోల్ వెర్షన్ 2.0-లీటర్ ఇంజన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది 150 BHP శక్తిని 300-320 Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
ఎక్స్-షోరూమ్ వద్ద మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ధరలు రూ, 15.40 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ధరల పట్టికను ఈ కింద చూడండి.
Mahindra Thar Earth Edition ఎక్స్-షోరూమ్ ధరలు
పెట్రోల్ MT - రూ 15.40 లక్షలు
పెట్రోల్ AT - రూ 16.99 లక్షలు
డీజిల్ MT - రూ 16.15 లక్షలు
డీజిల్ ఎటి - రూ 17.60 లక్షలు
ఇవన్నీ వాహనం యొక్క LX హార్డ్ టాప్-ఎండ్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. అన్ని యూనిట్లు 4x4 వ్యవస్థలతో అమర్చబడి ఉంటాయి.