New Delhi, July 27: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ (Suzuki India) భారత్‌లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్‌మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యాక్సెస్ 125 అత్యధికంగా 2,63,788 యూనిట్లు, అవెనిస్ 125 మోడల్ 1,52,578 యూనిట్లు, బర్గ్‌మాన్ స్ట్రీట్ వాహనాలు 72,045 యూనిట్లను ఇగ్నిషన్ కాయిల్‌లోని హై-టెన్షన్ వైర్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ (Suzuki Motorcycle India Recalls) చేసింది. ఈ వాహనాలు 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య కాలంలో తయారయ్యాయి. ఆయా మోడల్ స్కూటర్‌లు కొనుగోలు చేసినవారిని సంప్రదించే పనిలో కంపెనీ ఉంది. సమీపంలోని సర్వీస్ సెంటర్‌లో లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేసిస్తుంది.
వెబ్‌సైట్‌లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రాయింగ్ అవసరాలకు సరిపోని హై టెన్షన్ వైర్‌ను ఇగ్నిషన్ కాయిల్‌కు అమర్చడం వల్ల రన్నింగ్ సమయంలో వైర్ కోతలు పడటం, తెగిపోవడం జరుగుతోంది. దీంతో ఇంజన్ ఆగిపోవడం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కోతలు పడిన హై టెన్షన్ వైర్ నీటితో తడిసినప్పుడు వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్ లీక్ దెబ్బతినే అవకాశం ఉంది.
కాగా సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ వీ-స్ట్రోమ్ 800 డీఈ (V-Strom 800 DE)కి సంబంధించిన 67 యూనిట్లను కూడా రీకాల్ చేసింది. లోపభూయిష్టమైన వెనుక టైర్ దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. బైక్ వెనుక వెనుక టైర్‌పై పగుళ్లు వస్తున్నాయని, టైర్ ట్రెడ్ బయటకు వచ్చేస్తోందని, టైర్ రూపం దెబ్బతింటోందని కంపెనీ పేర్కొంది. ఆయా వాహనాల యజమానులకు సంప్రదిస్తున్నమని అవసరమైతే వెనుక టైర్ రీప్లేస్ చేస్తామని వివరించింది. ఈ వాహనాలు 2023 మే 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 23 మధ్య కాలంలో తయారయ్యాయి.