BMW 7 Series Protection: బీఎండబ్ల్యూ నుంచి బుల్లెట్ ప్రూఫ్ సెడాన్ కారు భారత మార్కెట్లో విడుదల, దీని ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే, ధర కూడా అదిరిపోయింది!
BMW 7 Series Protection | Pic: X

BMW 7 Series Protection: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW ఇప్పుడు నేరుగా బుల్లెట్ ప్రూఫ్, బాంబ్ ప్రూఫ్ ఆర్మర్డ్ కార్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. తమ బ్రాండ్ నుంచి ఇండియాలో మంచి సేల్స్ జరుగుతున్న BMW 7 సిరీస్ సెడాన్‌ కార్లలో ఈ తరహా రక్షణ వ్యవస్థను అందిస్తుంది.

దేశాధినేతలు, ప్రధాన మంత్రులు, విదేశీ ప్రముఖులు, CEOలు, MDలు, మల్టీ-బిలియనీర్లు, బహుళ జాతి కార్పోరేట్ కంపెనీ డైరెక్టర్‌లు మొదలైన వారి కోసం ఈ లిమోసిన్ రూపొందించారు. ఇది వీఐపీల భద్రత అవసరాలను సమర్థవంతంగా తీరుస్తుంది. ఈ BMW సాయుధ కారు మెర్సిడెస్-బెంజ్ గార్డ్‌కు ప్రత్యర్థి.

BMW 7 సిరీస్ ప్రొటెక్షన్ కారు ప్రత్యేకతలు

BMW షేర్ చేసిన వివరాల ప్రకారం, తాజాగా ప్రవేశపెట్టిన BMW 7 సిరీస్ ప్రొటెక్షన్ మోడల్ కారు, VR9 రక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది ప్రత్యేకమైన స్వీయ-రక్షణ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇందులో కవచం ఆర్మర్ స్టీల్‌తో తయారు చేయబడి ఉంటుంది, అండర్ బాడీ కోసం అదనపు కవచం, ఆర్మర్డ్ గ్లాస్ ఉన్నాయి.

ఇది బుల్లెట్లు, పేలుడు పదార్థాలు, డ్రోన్‌ దాడులు, బాలిస్టిక్ క్షిపణుల దాడులను సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఎలాంటి రసాయన దాడుల నుంచి కూడా ఇందులోని ప్రయాణీకులకు ఎలాంటి హాని కలగకుండా గొప్ప భద్రతను అందిస్తుంది. దాడులను తట్టుకునేందుకు దీని చట్రం 10 mm మందపాటి ఉక్కుతో అందిస్తున్నారు. అదనంగా 72 మిమీ మందపాటి మల్టీలేయర్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా అమర్చబడి ఉంటుంది.  ఈ సాయుధ సెడాన్ తలుపులు మోటరైజ్డ్ ఆధారితమైనవి. ఇవి  ఒక్కొక్కటి 200 కిలోల బరువును కలిగి ఉంటాయి. బుల్లెట్ తగలకుండా ప్రత్యేక కేసింగ్, ఇంధన ట్యాంక్ కూడా ఉంది.

దీని టైర్లు కూడా చాలా దృఢంగా ఉంటాయి. అనుకోని పరిస్థితులలో ఈ వాహనం టైర్‌ పంక్చర్ అయితే, ఫ్లాట్ టైరుతోనే సగటున 80 కి.మీ వేగంతో 30 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇది కాకుండా, ఈ సెడాన్‌లో నాలుగు డోర్ల నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అమర్చబడ్డాయి, ప్రమాదకరమైన పరిస్థితుల నుండి కారు నుంచి బయటపడేందుకు ఇవి సహాయపడతాయి.

ఇంజిన్ సామర్థ్యం

BMW 7 సిరీస్ ప్రొటెక్షన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 4.4-లీటర్ 8-సిలిండర్ ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో ఆధారితమైనది. దీని పవర్‌ట్రెయిన్ 524 BHP శక్తిని, 750 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బరువు అధికంగా ఉన్నప్పటికీ ఇది కేవలం 6.6 సెకన్లలోనే 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 210 km వేగంతో దూసుకెళ్లగలదు.

ధర ఎంత?

సాధారణంగా BMW 7 సిరీస్ లో స్టాండర్డ్ మోడల్ సెడాన్ కారు రూ. 1.70 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. వినియోగదారులు తాము కోరుకునే ఫీచర్లను కస్టమైజ్ చేసుకునే దానిని బట్టి ఖరీదు పెరుగుతుంది. కాబట్టి కొత్తగా విడుదల చేసిన BMW 7 సిరీస్ ప్రొటెక్షన్ కారు ధర ఎంత అనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఎంచుకునే ఫీచర్ల ఆధారంగా సుమారు రూ. 3.5 కోట్ల నుంచి రూ. 9 కోట్ల వరకు ధరలు ఉంటాయని అంచనా.