Vida V1 Plus EV: అన్నా.. మళ్లొచ్చింది.. భారీ డిస్కౌంట్ ధరతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ రీలాంచ్.. విడా V1 ప్లస్‌ను మళ్లీ మార్కెట్‌లో విడుదల చేసిన హీరో మోటోకార్ప్, అదనపు ఫీచర్లు ఏమున్నాయి, ధర ఎంత? ఇక్కడ తెలుసుకోండి!
Vida Electric V1 Plus - Pic: Hero MotoCorp Official

Vida V1 Plus Electric Scooter: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ రెండేళ్ల కిందట విడా V1 ప్లస్ మరియు విడా V1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. అయితే కొంతకాలానికే విడా V1 ప్లస్ వేరియంట్‌ను ఉత్పత్తి చేయడం నిలిపివేసింది. కేవలం విడా వి1 ప్రోను మాత్రమే విక్రయిస్తూ వస్తుంది. తాజాగా హీరో మోటోకార్ప్ మళ్లీ ఆ పాత విడా V1 ప్లస్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. భారత మార్కెట్‌లో 2024 విడా V1 ప్లస్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 1.15 లక్షలుగా నిర్ణయించారు. అంటే, గతంలో కంటే రూ. 30 వేల తక్కువ ధరకే అందిస్తున్నారు. సబ్సిడీల తర్వాత ఈ ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 97,800/- ధరకే లభించనుంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతుండటంతో ఈ మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకునేందుకు వ్యూహాత్మక చర్యగా, Vida Electric V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ అధికారికంగా తిరిగి ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, దీని టాప్ స్పెక్ మోడల్ అయిన విడా V1 ప్రో మోడల్ కంటే కూడా ఇది చాలా సరసమైనది. కానీ సామర్థ్యం, ఫీచర్ల విషయంలో దాదాపు సమానంగా ఉంటాయి.

Vida Electric V1 Plus బ్యాటరీ సామర్థ్యం

Vida V1 Plusలో 1.72 kWh సామర్థ్యం కలిగిన రిమూవేబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తున్నారు. దీనికి పోర్టబుల్ ఛార్జర్ కూడా ఉంటుంది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 100 కిమీ ప్రయాణ పరిధిని అందిస్తుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి డానికి 5 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. Vida V1 Plusలోని మోటార్ 25 Nm టార్క్‌తో 6 kW గరిష్ట అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.4 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 80 కిమీ.

Vida Electric V1 Plus ఫీచర్లు

విడా V1 ప్లస్ ఈవీలో ఎకో, రైడ్ మరియు స్పోర్ట్ అనే మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పూర్తిగా డిజిటల్ యూనిట్ తో అందిస్తున్నారు. 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంది, దీని డిస్‌ప్లే ఇంటర్నెట్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది, తద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, జియోఫెన్సింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్ , వెహికల్ డయాగ్నోస్టిక్‌ వంటి అనేక ఫీచర్లను ఎనాబుల్ చేయవచ్చు.

అదనంగా, భద్రత కోసం రైడర్లు SOS హెచ్చరికను వివిధ మొబైల్ నంబర్లకు పంపవచ్చు. ఇంకా V1 ప్లస్‌లో బ్లూటూత్ సపోర్ట్, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్‌, యాంటీ-థెఫ్ట్ అలారం, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రానిక్ సీట్, హ్యాండిల్ లాక్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్- రీజెన్ అసిస్ట్ కోసం టూ-వే థ్రోటిల్ ఉన్నాయి. ఈ స్కూటర్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో సహా పూర్తిగా LED లైటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

వారంటీ గురించి చెప్పాలంటే, V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 5-సంవత్సరాలు లేదా 50,000 కి.మీ వాహన వారంటీతో వస్తుంది, అయితే బ్యాటరీకి 3-సంవత్సరాలు లేదా 30,000 కి.మీ వారంటీ ఉంటుంది.దీని టాప్ స్పెక్ మోడల్ అయిన విడా V1 ప్రో మోడల్ కంటే ఇది చాలా సరసమైనది. కానీ సామర్థ్యం, ఫీచర్ల విషయంలో దాదాపు సమానంగా ఉంది.