Bajaj CNG Bikes: మోటార్ బైక్ తయారీలో స‌రికొత్త విప్ల‌వానికి బ‌జాజ్ నాంది, ఇక‌పై సీఎన్ జీ బైక్స్ త‌యారు చేస్తామ‌ని బ‌జాజ్ ప్ర‌క‌ట‌న‌, ఎప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయంటే?
Representational (Credits: Google)

New Delhi, JAN 31: ఆటోమొబైల్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో (Bajaj Auto) ద్విచక్ర వాహన విభాగంలో కొత్తదనానికి నాంది పలకనుంది. ఇప్పటికే సీఎన్‌జీతో నడిచే త్రీవీలర్‌ వాహన విభాగంలో సత్తా చాటుతున్న ఆ కంపెనీ.. ద్విచక్ర వాహనాల్లోనూ అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి సీఎన్‌జీ (CNG) బైక్‌ను తీసుకురానుంది. ఈ విషయాన్ని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ బుధవారం వెల్లడించారు. ‘‘దేశానికి, సమాజానికీ సీఎన్‌జీ సరైన ఎంపిక. ఈ విషయం త్రీ వీలర్‌ (Three Wheeler) వాహనాల ద్వారా రుజువైంది. ఇప్పుడు ద్విచక్ర వాహనాల ద్వారా మరోసారి నిరూపించనున్నాం. ఉత్పత్తి వ్యయం కారణంగా సీఎన్‌జీతో (CNG) రానున్న బైకులు పెట్రోల్‌తో నడిచే వాటి కంటే ఎక్కువ ధర ఉండనున్నాయి’’ అని శర్మ అన్నారు. అయితే, సీఎన్‌జీ వాహనాలపై జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇది కస్టమర్లకు, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

Huge Discounts on Vida V1 Pro: త్వరపడండి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.24 వేల వరకు డిస్కౌంట్, కేవలం రూ.499 చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు 

‘‘2020లో త్రీ-వీలర్‌ విభాగంలో సీఎన్‌జీ వినియోగం కేవలం 25 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడది 60 శాతానికి చేరింది. 2020లో 2,000 ఫిల్లింగ్‌ స్టేషన్లు ఉండగా.. ఈ ఏడాది నాటికి ఆ సంఖ్య 8 వేలకు చేరుతుందని ఆశిస్తున్నా. సీఎన్‌జీ ఫ్లిల్లింగ్‌ స్టేషన్లను విస్తరణను ప్రభుత్వం వేగవంతం చేయడంతో వాహనాల విక్రయాలు పెరిగాయి’’ అని బజాజ్‌ ఆటో ఈడీ తెలిపారు. సీఎన్‌జీ అనేది శిలాజ ఇంధనం అయినప్పటికీ ఇతర ఇంధనాలతో పోలిస్తే కాలుష్యం తక్కువన్నారు. ఫిబ్రవరి 1న జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఫ్లెక్స్ ఇంధనం, మోనో ఫ్యూయల్, సీఎన్‌జీ వాహనాలను బజాజ్ ఆటో ప్రదర్శించనుంది.