Mumbai, October 30: బంగారం ధరలు (Gold Prices) మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఆల్-టైమ్ కనిష్టానికి పడిపోవడం (Economic Crisis), పలు దేశాల మధ్య రాజకీయ అనిశ్చితి (Trade War), డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమవడం తదితర కారణాల చేత పసిడి రేటు అంతకంతకు పెరుగుతూ పోతుంది. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్లలో సురక్షిత స్థానంలో ఉండేందుకు ఎప్పుడు పురోగతిలో ఉండే బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపుతున్నారు. సెంట్రల్ బ్యాంక్ భారీ స్థాయిలో పసిడిని కొనుగోలు చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 40 వేల దగ్గర కదలాడుతూ ఉంది. మంగళవారం 10 గ్రాముల బంగారం బులియన్ మార్కెట్లో రూ. 39,510 వద్ద ముగిసింది. నిన్న మంగళవారం పసిడి ధర రూ. 548 తగ్గినా, ఈ తగ్గుదల కొనసాగే అవకాశం లేదని చెబుతున్నారు. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగుతూ డిసెంబర్ నాటికి 10 గ్రాముల బంగారం రూ. 42,000 గరిష్టానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలో రూపాయి విలువ 1.4 శాతం పతనమైంది, ఈ కారణంతో బంగారం ధరలు ఇప్పటివరకు 15% వరకు పెరిగాయి.
ఈక్విటీ మార్కెట్ల కంటే బంగారం, భూములపై పెట్టుబడి పెట్టినవారికే అధిక రిటర్న్స్ వస్తుండటంతో ఏడాది కాలంగా వీటిపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ పోతుంది. ఫలితంగా సామాన్యులకు అందని ద్రాక్షగా బంగారం మారిపోయింది. భారీ ధరల కారణంగా సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో ఈ దీపావళి వెలుగులు నింపలేకపోయింది. ఈ ఏడాది మార్కెట్లో బంగారం కొనుగోళ్లు దారుణంగా పడిపోయాయి. దేశవ్యాప్తంగా దీపావళి పండుగను సగటు జనాభా ఘనంగా జరుపుకోలేకపోయింది. పండుగలకు కూడా ఖర్చు చేసేందుకు జనం వెనుకాడారు. ఈసారి దుస్తుల అమ్మకాలు సైతం 28 శాతం పడిపోయాయి.
అమెరికా- యూఎస్ మధ్య ట్రేడ్ వార్ ఒక కొలిక్కి వచ్చే అవకాశమే కనిపించడం లేదు. బలమైన ఆర్థిక వ్యవస్థ గల దేశాల మధ్య నడుస్తున్న వాణిజ్యపరమైన యుద్ధం కారణంగా దాని ప్రభావం మిగతా దేశాలపై పడుతుంది. ఇండియా లాంటి దేశాలలో ఆర్థిక మాంద్యం కొనసాగుతూ ఉంది. అంతర్జాతీయంగా ఉన్న ఈ రాజకీయ, వాణిజ్య అనిశ్చితి తొలగేంత వరకు బంగారం మరియు ఇతర విలువైన లోహాల ధరలు పెరుగుతూనే ఉంటాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా, దేశంలో ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈక్విటీ రంగంలో టాక్సుల విషయంలో మరిన్ని మినహాయింపులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు నీతి ఆయోగ్ పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. నవంబర్ చివరి నాటికి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసి ప్రధాని ఆమోదం కొరకు పంపనున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి.