Mumbai,November 29: దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) మొదట ఉచిత ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక్కో షాక్ ఇస్తూ వచ్చింది. టారిఫ్ రేట్లను పెంచుతూ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ (Jio Fiber Preview offer) ఉచితంగా వాడాలనుకునే కొత్త కస్టమర్ల(New users)కు ఝలక్ ఇచ్చింది.
రిలయన్స్ జియో ఫైబర్ (Jio Fiber) తన బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను నూతనంగా తీసుకునే కస్టమర్లకు గతంలో ప్రివ్యూ ఆఫర్‌ను అందించిన విషయం విదితమే. అందులో భాగంగా కస్టమర్లు రూ.2500 లేదా రూ.4500 రీఫండబుల్ డిపాజిట్ చేస్తే 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 1.1 టీబీ డేటాతో బ్రాడ్‌బ్యాండ్‌ను వాడుకునే వీలు కల్పించారు. అయితే ఇకపై ఈ ఆఫర్‌ను కొత్త కస్టమర్లకు జియో ఫైబర్ ఇవ్వడం లేదు.
ఇక ఇప్పటికే ప్రివ్యూ ఆఫర్‌ను ఉచితంగా ఉపయోగించుకుంటున్న వినియోగదారులను ఆటోమేటిగ్గా పెయిడ్ ప్లాన్లకు మార్చుతున్నట్లు కూడా జియో తెలిపింది. కాగా జియో ఫైబర్‌లో కస్టమర్లకు రూ.699 మొదలుకొని రూ.8499 వరకు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో నెలవారీ ప్లాన్లు మాత్రమే కాకుండా, 3, 6, 12 నెలల ప్లాన్లు కూడా కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.