File image of RBI Governor Shaktikanta Das | (Photo Credits: PTI)

Mumbai, February 6:  2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ చివరి ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఇండియా గురువారం వెల్లడించింది. కీలక వడ్డీ రేట్లను యధాతతంగా ఉంచింది. ఈరోజు సమావేశమయిన ఆర్‌బీఐ యొక్క ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) రెపో రేటును 5.15 శాతంగా యధాతథంగా ఉంచింది. అలాగే రివర్స్ రెపో రేటులో కూడాఎలాంటి మార్పులు చేయకుండా 4.9 శాతం వద్ద ఉంచింది. వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచే అంశంపై మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ధరల పెరుగుదల, ముఖ్యంగా ఉల్లి ధరలలో అసాధారణ పెరుగుదల కారణంగా, 2019 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే పెరిగిందని ఎంపిసి గుర్తించింది. అయితే ప్రస్తుతం ఉల్లి ఉత్పత్తులు మెరుగుపడటంతో రాబోయే వారాలు మరియు నెలల్లో వాటి ధరలు తగ్గుతాయని కమిటీ అభిప్రాయపడింది.

ఉల్లి ధరలే కాకుండా, ఇతర ఆహార పదార్థాలైన పాలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, వంట నూనెలు, గుడ్లు, మాంసం మరియు చేపలు వంటి అనేక ఆహర ఉత్పత్తుల ద్వారా కూడా ద్రవ్యోల్బణం కూడా పెరిగిందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే ఆహార ద్రవ్యోల్బణం 4.7 శాతం మితంగానే ఉందని ఆయన అన్నారు.

ఆహార ద్రవ్యోల్బణం మితంగా ఉండగా, రవాణా, టెలికాం వంటి సర్వీస్ సెక్టార్ రంగాలలో పెరుగుదలను సూచించింది, అధిక కస్టమ్స్ రేట్లతో పాటు వినియోగదారుల ధరలకు ప్రమాద కారకాలుగా హెచ్చరించింది. ఆహారంలో కూడా, కూరగాయల ధరలు తగ్గుతున్నాయని, అయితే ప్రోటీన్ ఆధారిత ఇతర ఉత్పత్తుల ధరలు పెరుగుదల కారణంగా రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణ రేటుపై మరింత ఒత్తిడిని కలిగిస్తుందని సెంట్రల్ బ్యాంక్ అంచనావేస్తుంది. ఆహారేతర ద్రవ్యోల్బణం 2020-21లో కూడా కొనసాగుతూనే ఉంటుందని అంచనా వేసింది.

బడ్జెట్ అంచనాలతో పోల్చితే 2019-20లో అధిక ద్రవ్య లోటు వల్ల మార్కెట్ రుణాలు పెరగలేదని ఎంపిసి తెలిపింది. 2020-21 సంవత్సరానికి ద్రవ్య లోటు జిడిపిలో 3.5 శాతానికి తగ్గుతుందని బడ్జెట్ పేర్కొంది.

నివేదికల ప్రకారం, ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో పెరుగుతుందని మరియు ద్రవ్యోల్బణం యొక్క దృక్పథం చాలా అనిశ్చితంగా ఉందని ఆర్బిఐ అంచనా వేస్తుంది. 2020-21లో జిడిపి వృద్ధి 6 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ తెలిపింది.

ఇదిలా ఉండగా, ఆర్బీఐ సమీక్ష ప్రకటనల ద్వారా, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కదిలాయి. సెన్సెక్స్ 139 పాయింట్లు పెరిగి 41,282 వద్ద మరియు నిఫ్టీ 12,129 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.