Mumbai, October 26: చమురు నుంచి టెలికం రంగం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా డిజిటల్ సేవలు అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా రిలయన్స్ జియో (ఆర్‌జియో) లిస్టింగ్ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నది. నూతనంగా ఏర్పాటు చేయనున్న సంస్థలో రూ.65 వేల కోట్లతో ఏర్పాటు చేసిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్(ఆర్‌జేఐఎల్) కలిసిపోనున్నది. ముకేష్ అంబానీ డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రిలయన్స్ జియో సహా డిజిటల్ వ్యాపార విభాగాలకు ఉన్న రుణభారాన్ని (సుమారు రూ. 1.73 లక్షల కోట్లు) తన పేరిట బదలాయించుకోనుంది. ఈ విషయాన్ని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది.
ఈ నూతన సంస్థను ఏర్పాటు చేయడానికి కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ నిధులను కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను జారీ చేయడం ద్వారా సేకరించాలనుకుంటున్నది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయితే 2020 మార్చి 31 నాటికి స్పెక్ట్రం పరంగా చెల్లించాల్సిన చెల్లింపులు తప్పితే రిలయన్స్ జియో పూర్తి రుణ రహిత సంస్థగా మారుతుందని పేర్కొంది.ఈ సందర్భంగా ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ..డిజిటల్ సేవలు అందించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నూతన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు, ఈ ప్లాట్‌ఫామ్ కింద దేశంలో నంబర్-1 కనెక్టివిటీ కలిగిన సంస్థగా తీర్చిదిద్దడమే తమ తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు.
జియో నెట్‌వర్క్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. దీంతో కంపెనీ ఖాతాల్లో అప్పుల భారమూ పెరిగింది. కంపెనీ ప్రస్తుతం ఈ భారాన్ని తగ్గించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం మార్చిలో జియోకు చెందిన రూ.1.25 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్‌స్టమెంట్స్ ట్రస్టు (ఇన్విట్స్)లకు బదిలీ చేసింది. దీంతో జియో ఆస్తుల విలువ రూ.2.37 లక్షల కోట్ల కు తగ్గింది. జియో నెట్‌వర్క్ ద్వారా రిలయన్స్ అందించే డిజిటల్ సేవల్లో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే అనేక సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశారు.ఈ సంస్థల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకే రిలయన్స్ ఇప్పుడు జియో ఆస్తులను పూర్తి అనుబంధ కంపెనీకి బదిలీ చేస్తోందని భావిస్తున్నారు.
జియోఫోన్ యూజర్లకు నూతన టారిఫ్ ప్లాన్లు
మరింత మంది ఫీచర్ ఫోన్ల వినియోగదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో జియోఫోన్ యూజర్లకు నూతన టారిఫ్ ప్లాన్లను ప్రకటించింది రిలయన్స్ జియో. రూ.75 నుంచి రూ.185 లోపు కలిగిన నాలుగు ప్లాన్లలో 500 నిమిషాలపాటు ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటికే ఇంటర్‌కనెక్ట్ చార్జీలపై 6 పైసలు విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.