Mumbai Febuary 29: టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) సంచలన ప్రతిపాదనలు చేసింది. భారీ నష్టాలకు తోడు ఏజీఆర్ బకాయిల చెల్లింపు (AGR dues) వివాదంతో మరింత కుదేలైన ఈ సంస్థ మొబైల్ డేటా, కాల్ చార్జీలపై కొన్ని సవరణలు చేయాలని కోరుతోంది. డేటా చార్జీలను కనీసం 7 రెట్లు , కాల్ చార్జీలను 8 రెట్లు పెంచాలని కోరుతోంది. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి ఒక లేఖ రాసింది.
మొబైల్ డేటా చార్జీని (Mobile Data Tariff) ఒక జీబీకి రూ. 35 వుండాలని,( ప్రస్తుతం జీబీకి రూ. 4-5) అవుట్ గోయింగ్ కాలింగ్ చార్జి నిమిషానికి 6 పైసలుగా( మంత్లీ చార్జీ కాక) నిర్ణయించాలని డాట్‌కు రాసిన లేఖలో వొడాఫోన్ ఐడియా కోరింది. దీంతోపాటు కనీస నెలవారీ కనెక్షన్ ఛార్జీ రూ. 50లుగా ఉంచాలని ప్రతిపాదించింది.
ఏజీఆర్ బకాయిలు చెల్లించేందుకు సహాయపడటానికి ఏప్రిల్ 1 నుంచి ప్రతిపాదిత రేట్లను అమలు చేయాలని కోరుతోంది. మార్కెట్ వాటా తగ్గడం మరియు ప్రభుత్వానికి ఎజిఆర్ బకాయిలు చెల్లించడం వల్ల కంపెనీ గత కొన్ని వారాలలో భారీ నష్టాలతో సహా ఆర్థిక ఇబ్బందులను వెల్లడించింది.
ఇదిలా ఉంటే ఏజీఆర్ బకాయిలకు సంబంధించి వోడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి మొత్తం రూ. 53,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిల్లో కంపెనీ ఇప్పటికే రూ 3500 కోట్లు చెల్లించగా, స్వయం మదింపు ఆధారంగా రూ 23,000 కోట్లు ఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. మరోవైపు బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారటోరియం గడవు ఇవ్వాలని, బకాయిలు చెల్లించడానికి 18 సంవత్సరాల సమయం కోరినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్, జియో కూడా టారిఫ్‌లను పెంచిన సంగతి తెలిసిందే.
కాగా భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) సంస్థ తన బాకీలో భాగంగా ఇవాళ 8004 కోట్ల సొమ్మును టెలికాంశాఖకు చెల్లించింది. ఎయిర్‌టెల్ సంస్థ ఈమధ్యే పది వేల కోట్లను టెలికాంశాఖకు చెల్లించింది. దానికి తోడుగా ఇవాళ చివరి సెటిల్మెంట్‌లో భాగంగా ఎనిమిది వేల కోట్లను చెల్లించింది. భారతీ గ్రూప్ ఆఫ్ కంపెనీల తరపున ఈ పేమెంట్ జరిగింది. బాకీల కింద మూడు వేల కోట్లు, అడ్‌హక్ పేమెంట్ కింద మరో 5 వేల కోట్లు చెల్లించింది. ఏజీఆర్ బాకీలు చెల్లించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.