Sai Dharam Tej's Health Update: నిలకడగా సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపిన వైద్యులు, ప్రమాద ఘటనకు సంబంధించి సీసీ టీవీ పుటేజీ విడుదల, నిర్లక్ష్యం, రాష్‌ డ్రైవింగ్‌ కింద సాయి తేజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
Sai Dharam Tej (Photo Credits: Instagram)

రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై (Sai Dharam Tej's Health Update) వైద్యులు తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ‘సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం’ అని అపోలో ఆస్పత్రి వైద్యులు (Apollo doctors) వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై రేపు మరో బులెటిన్‌ (Sai Dharam Tej health Condition) విడుదల చేస్తామని తెలిపారు.

మెగా హీరో సాయి తేజ్‌ జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. సాయి తేజ్‌ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఇక బైక్ రాష్ డ్రైవింగ్ చేసినందున సాయి తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం, రాష్‌ డ్రైవింగ్‌ కింద ఐపీసీ సెక్షన్ 336, 184 సెక్షన్ల పై కేసు నమోదు చేసి అతని బైక్ ని కస్టడీ లోకి తీసుకున్నారు.

Here's Cc footage

సాయిధరమ్ తేజ్‌ప్రమాదంపై సీనియర్‌ నటుడు నరేశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘మా అబ్బాయి నవీన్‌కి తేజ్‌ క్లోజ్‌ఫ్రెండ్‌. ప్రమాదం జరగడానికి ముందు మా ఇంటి నుంచే ఇద్దరూ కలిసి బయలుదేరారు. బైక్‌పై వద్దని చెబుదామనుకున్నా, కానీ ఆలోపే వెళ్లిపోయారు.పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాల్సిన సమయంలో ఎటువంటి రిస్క్‌ తీసుకోవద్దు. వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇవ్వాలనుకున్నా ఈలోపే ప్రమాదం జరగడం బాధాకరం. వేగం విషయంలో యువత కంట్రోల్‌ ఉండాలి. నాకు ఒకసారి చిన్న ప్రమాదం జరగడంతో.. బాధతో మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో మళ్లీ బైక్‌ ముట్టుకోలేదు.

కోటా శ్రీనివాసరావు, బాబుమోహన్, కోమటి రెడ్డి అబ్బాయిలు ఇలాగే ప్రమాదాల్లో మరణించి వారి కుటుంబాలను శోక సముద్రంలో ముంచారు. కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోరి అందరూ అనవసరంగా బైక్‌ ముట్టుకోకుండా ఉండాల’ని నరేశ్‌ కోరారు. సాయిని చూడడానికి ఆసుపత్రికి వద్దామనుకున్నాను. కానీ అక్కడ ఐసీయూలో ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇక్కడి నుంచే వీడియో ద్వారా మాట్లాడుతున్నాను. త్వరలో సాయి ధరమ్ తేజ్‌ని కలుసుకుంటాను..’’ అని తెలిపారు

Here's Hero Naresh Video

మరోవైపు సాయి తేజ్‌ని పలువురు సినీ నటులు పరామర్శిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్, శ్రీకాంత్ తదితరులు సాయితేజ్‌ను ఈ ఉదయం పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ‘వైద్యులతో మాట్లాడాం. సాయి తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మన అందరికి తెలుసు సాయి ఒక ఫైటర్. అతను త్వరగా కొలుకుంటారు’ అని ప్రకాశ్‌ రాజ్‌ ఆకాంక్షించారు. సాయి తేజ్‌ త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుందామని శ్రీకాంత్‌ అన్నారు.

వెంటిలేటర్‌పై హీరో సాయి ధరమ్ తేజ్, అభిమానులు ఆందోళన చెందవద్దని ట్వీట్ చేసిన హీరో చిరంజీవి, అపోలో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స

ఈ ప్రమాదం గురించి తాజాగా మాదాపూర్‌ ఏసీపీ స్పందించారు. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్‌ హెల్మెట్‌ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని తెలిపారు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యిందని.. దాని వల్ల తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయారని ఆయన అన్నారు. ప్రస్తుతం సాయి ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని ఏసీపీ తెలిపారు.

సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్‌ బోన్‌ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.