Deepika Padukone confirmed for Prabhas 21 (Photo Credits: Instagram)

అలనాటి మేటి నటి సావిత్రి బయోపిక్‌ను తెరపై 'మహానటి' గా అత్యద్భుతంగా ఆవిష్కరించి మంచి ప్రశంసలు అందుకొన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్, తన తదుపరి చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో ఇద్దరు అతిపెద్ద స్టార్లతో రూపొందిస్తున్నారు. ఇందులో ఒకరు బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్‌డమ్ సంపాదించిన హీరో ప్రభాస్ కాగా, మరొకరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్.

టైటిల్ ఇంకా ఖరారు చేయని 'ప్రభాస్ 21' చిత్రానికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రభాస్‌కు సరిజోడిగా ఎవరనేది చాలా కాలంగా సస్పెన్స్‌లో పెట్టింది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నుంచి సౌత్ స్టార్ కీర్తి సురేష్ వరకు చాలా మంది స్టార్ హీరోయిన్లను జాబితాలో చేర్చింది. ఎట్టకేలకు దీపికా పదుకోన్‌ను ఖరారు చేసినట్లు ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

గత 50 ఏళ్లుగా శ్రీదేవి మొదలుకొని శిల్పా షెట్టి, ఐశ్వర్య రాయ్, ప్రీతి జింటా నుంచి నేడు ఇలియానా, కాజల్ అగర్వాల్, జెనిలియా ఇండియాలోనే ఎంతో పేరుగాంచిన నటీమణులతో సినిమాలు నిర్మించిన తమ సంస్థ ఇప్పుడు సగర్వంగా దీపిక పదుకోన్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నామంటూ 'ప్రభాస్21' సర్‌ప్రైజ్ వీడియోను విడుదల చేసింది.

Check Out the Announcement: 

Here's a surprise video

ఇక ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రం రాధా కృష్ణ కుమార్ పాత్రలో 'రాధే శ్యామ్' అనే సినిమాతో బిజీగా ఉన్నారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఇటీవలే ఆవిష్కరించబడింది. యూరప్‌లో ఓ జంట మధ్య ఆవిష్కరింపబడే ప్రేమ కథగా రాధేశ్యామ్  రూపొందుతోంది.

మరోవైపు దీపిక తన భర్త రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న '83 సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ విశ్వవిజేతగా నిలిచిన 1983 క్రికెట్ ప్రపంచ కప్ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రలో నటిస్తున్నారు.