సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు లోక నాయకుడు కమల్ హాసన్. ఆయన తాజాగా నటించి బ్లాక్‌బ్లస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'విక్రమ్'. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ మూవీ విడుదలైన రెండు వారాల్లో రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది.
ఈ విషయంపై తాజాగా కమల్ హాసన్ స్పందించారు. చెన్నైలో రక్తదాన ప్రచార కార్యక్రమంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే డబ్బు గురించి చింతించని నాయకుడు మనకు కావాలి. గతంలో ఒకసారి నేను రూ. 300 కోట్లు సంపాదించగలను అని చెబితే ఎవరూ నా మాట నమ్మలేదు. అసలు వాళ్లు అర్థం చేసుకోలేదు కూడా. ఇప్పుడు విక్రమ్ బాక్సాఫీస్ వసూళ్లతో నా మాట నిజమైంది. ఇక ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటాను.
నా కుటుంబం, సన్నిహితులకు చేతనైన సాయం చేస్తాను. ఒకవేళ నా దగ్గర డబ్బు అయిపోతే ఇవ్వడానికి ఏం లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పక్కన వాళ్ల సాయం చేయాలని నాకు ఉండదు. నాకు గొప్ప పేరు వద్దు. ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నాను.' అని కమల్ హాసన్ పేర్కొన్నాడు.