తెలుగు సినిమా అగ్రకథానాయకుడు దగ్గుబాటి వెంకటేశ్, ప్రియమణి (Venkatesh and Priyamani)ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’ ట్రైలర్ (Narappa Trailer Released) విడుదలయింది. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల (Director Srikanth Addala) దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ఎన్నో రోజుల సంగ్ధిదత తర్వాత ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం ‘నారప్ప’ ట్రైలర్‌ను నెట్టింట్లో విడుదల చేసింది.
భూమి కోసం పోరాటం చేసే వ్యక్తిగా వెంకటేశ్ నటన అదరహో అనిపించేలా ఉంది. ‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ వెంకీ మామ చెప్పిన డైలాగ్ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.
తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అసురన్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. కుల వ్యవస్థ, భూవివాదం వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తమిళ్‌లో ధనుష్ నటించిన ‘అసురన్’ ప్రేక్షకులు, ప్రముఖుల నుంచే కాకుండా విమర్శకుల నుంచీ ప్రశంసలు అందుకుంది.
కాగా, తెలుగు నేటివిటీకి తగిన విధంగా ‘అసురన్’లో కొన్ని మార్పులు చేసి ‘నారప్ప’ తెరకెక్కించారు. ఇందులో వెంకటేశ్ సరసన ప్రియమణి కనిపించనున్నారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ స్వరాలు అందించారు. సురేశ్ ప్రొడెక్షన్స్ పతాకంపై సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.