Puneeth-Rajkumar

కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో (Puneeth Rajkumar Dies) మరణించారు. ఈ ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. తీవ్రస్థాయిలో ఛాతీలో నొప్పి రావడంతో పునీత్ రాజ్ కుమార్ ను సహాయకులు, జిమ్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. పునీత్ బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు (Puneeth Rajkumar No More) వెళ్లిపోయారు.

పునీత్ ఆసుపత్రిపాలైన విషయం తెలుసుకుని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. పునీత్ వయసు 46 సంవత్సరాలు. దివంగత మహానటుడు రాజ్ కుమార్ తనయుల్లో ఒకడైన పునీత్ కన్నడ నాట అగ్రహీరోగా గుర్తింపు పొందారు. ఆయన మృతికి సంతాపంగా కర్ణాటక ప్రభుత్వం అన్ని సినిమా హాళ్లను మూసివేసింది. పునీత్‌ని అభిమానులు ఎంతో ప్రేమగా అప్పూ అని పిలుచుకుంటారు. 1976లో బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన పునీత్‌... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్‌ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. ఆయన మృతిపై ట్విట్టర్ లో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

రాజ్ కుమార్ మృతికి ప్రముఖులు సంతాపం

హీరోగా అప్పు దాదాపు 29 సినిమాల్లో నటించారు. `అభి`, `వీర కన్నడిగ`, `మౌర్య`, `ఆకాష్‌`, `నమ్మ బసవ`, `అజయ్‌`, `అరసు`, `మిలన`, `బిందాస్‌`, `రాజ్‌`, `పృథ్వీ`, `జాకీ`, `హంగామా`, `అన్న బాండ్‌`, `పవర్‌`, `రానా విక్రమ`, `చక్రవ్యూహ`,`దొడ్మనె హగ్డ్`, `రాజకుమార`, `అంజని పుత్ర` చిత్రాలతో పవర్‌ స్టార్‌గా ఎదిగారు. `చివరిగా ఆయన `యువరత్న` చిత్రంలో నటించారు. ఇది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం `జేమ్స్`, `ద్విత్వ` చిత్రాల్లో నటిస్తున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో కన్నడ నాట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సినీ ప్రముఖులు తీవ్ర విషాదాన్ని తెలియజేస్తున్నారు.