భారత కోకిల లతా మంగేష్కర్ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ఇక సెలవంటూ అందరికీ వీడ్కోలు చెప్తూ ఫిబ్రవరి 6న ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఆమె ఇంటికి చేరుకుని లతా మంగేష్కర్ పార్థివదేహానికి (Lata Mangeshkar Funeral) కడసారి నివాళులు అర్పించారు. చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan ) కూడా లెజెండరీ సింగర్‌కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు వచ్చాడు. అయితే నివాళులు అర్పించే సమయంలో ఆయన చేసిన పనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షారుక్ తన మేనేజర్‌తో కలిసి లతా మంగేష్కర్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చాడు. ఆ సమయంలో సింగర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మాస్క్‌ను కిందకు దించి ఆమె పాదాల దగ్గర ఊదాడు. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొందరు షారుక్ లతా పాదాల దగ్గర ఉమ్మేసినట్లు కామెంట్లు చేస్తున్నారు. షారుక్ ప్రవర్తనను ఎండగడుతూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై పలువురు నెటిజన్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తూ.. షారుక్ ఉమ్మేయలేదని, భౌతిక కాయం దగ్గర ఊదడం అనేది ఒక ప్రార్థనా విధానమని ట్రోలర్లపై మండిపడుతున్నారు.