Sonu Sood: ఏడవకు చెల్లెలా..అన్నయ్య ఉన్నాడంటూ సోనూ ట్వీట్, వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు బాసటగా నిలిచిన సోనూ, వెంటనే స్పందించిన ఛత్తీస్‌గఢ్ సీఎం
Sonu Sood helps flood-hit girl (Photo-Twitter, Video Grab)

లాక్‌డౌన్‌ నుంచి సమస్యల్లో ఉన్నవారికి సాయం చేస్తూ బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ (Sonu Sood) రియల్‌ హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా కాలంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి స్వరాష్ట్రాలకు చేర్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఎక్కడ సమస్య, సాయం పేరు విన్న వెంటనే స్పందిస్తూ వారికి చేయూతనిస్తున్నారు. అంతేగాక ప్రజలు కూడా తమ సమస్యలను నేరుగా సోనూ సూద్‌కు సోషల్‌ మీడియా వేదిక తెలుపుతున్నారు.

తాజాగా మరో సారి తన మంచితనాన్ని చాటుకున్నారు. వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలిక అంజలికి బాసటగా (Sonu Sood offers help to flood-hit girl) నిలిచారు. గత కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఛత్తీస్గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా బిజాపూర్‌, బస్తర్‌లోని అంజలి‌ అనే బాలిక ఇళ్లు కూలిపోయింది. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోయాయి. తన పుస్తకాలు కూడా తడిచి పాడయ్యాయి. దీంతో బాలిక కన్నీరు మున్నీరుగా విలపించింది. దీన్నంతా వీడియో తీసిన జర్నలిస్ట్‌ ముఖేష్‌ చంద్రకర్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో కాస్తా సోనూ సూద్ దృష్టికి వచ్చింది.

బుధవారం ట్విటర్‌ ద్వారా స్పందించిన సోనూ ‘‘ కన్నీళ్లు తుడుచుకో చెల్లెలా. ఇళ్లు కొత్తదవుతుంది.. పుస్తకాలు కూడా కొత్తవవుతాయి’’ అని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ వీడియోపై స్పందించిన ముఖ్యమంత్రి భూపేశ్‌ భగెల్‌ (Chhattisgarh chief minister Bhupesh Baghel) సైతం బాలిక కుటుంబానికి సహాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Here's Sonu Tweet

మావోయిస్టు బాధిత జిల్లాకు చెందిన కోమల గ్రామ పంచాయతీ నివాసి. బాలిక తండ్రి ఒక రైతు మరియు 5 ఎకరాల భూమిని కలిగి ఉన్నారు, కాని వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు తెలిపారు. తన ఇంటిని నిర్మించినందుకు కలెక్టర్ రితేష్ అగర్వాల్, స్థానిక ఎమ్మెల్యే విక్రమ్ మాండవి బుధవారం అంజలికి రూ .1.1 లక్షల చెక్కును అందజేశారు. బాలిక నర్సింగ్ కళాశాల ప్రవేశానికి జిల్లా ప్రభుత్వం పుస్తకాలను కూడా అందిస్తామని తెలిపారు. సోనూసూద్ గొప్ప మనసుపై సోషల్ మీడియా వేదికగా పొగడ్తల వర్షం

గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బీజాపూర్, సుక్మాతో సహా దక్షిణ బస్తర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ ప్రాంతాలలో గ్రామాలు మునిగిపోవడంతో 1, 500 మందికి పైగా సహాయ శిబిరాలు మరియు ఇతర సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అధికారుల ప్రకారం, సుక్మలో సాధారణ 781 మిల్లీమీటర్లతో పోలిస్తే 916 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, జూన్ నుండి బీజాపూర్ 1, 647 మిల్లీమీటర్లు నమోదైంది. వర్షం కారణంగా బీజాపూర్‌లో సుమారు 120 ఇళ్లు కూలిపోయాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,000 మందిని సహాయ శిబిరాలకు తరలించారు