Hyderabad, 12th August:  తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు కుటుంబ సమేతంగా దైవదర్శనం కోసం తమిళనాడులోని కాంచీపురానికి బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన, ఆ తర్వాత రోడ్డు మార్గంలో కంచి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలో నగరి ఎమ్మెల్యే, ఏపిఐసిసి చైర్మన్ రోజా సెల్వమణి నుంచి సీఎం కేసీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. షెడ్యూల్ ప్రకారం రోజా ఇంట్లో కేసీఆర్ కు ఆతిథ్యం ఉంది అయితే సమయం మించిపోవడంతో తిరుగు ప్రయాణంలో వారి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వచ్చేటపుడు తిరుమల శ్రీవారి దర్శనం కూడా కేసీఆర్ షెడ్యూల్ లో ఉంది.

ఇదిలా ఉండగా, అంతకుముందు రోజు ఆదివారం రోజున సీఎం కేసీఆర్, ప్రముఖ సినీ దర్శకులు కళాతపస్వి కే.విశ్వనాథ్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా సినిమా, కళలు మరియు సాహిత్యానికి సంబంధించి ఇద్దరి మధ్య గంటకు పైగా ఆసక్తికర చర్చ జరిగింది. ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు కె. విశ్వనాథ్ కు తానో అజ్ఞాత అభిమానిగా చెప్పుకున్న కేసీఆర్, తన నుంచి సమాజానికి మంచి సందేశం అందించే మరో చిత్రం రావాలని ఆకాంక్షించారు. విశ్వనాథ్ దర్శకుడయితే, నిర్మాణ పరమైన విషయాలు తాను చూసుకుంటానని ఈ సందర్భంగా సీఎం ఆయనకు మాటిచ్చారు. అయితే తన వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఇక సినిమాలు తీసే ఓపిక తనకు లేదని కే. విశ్వనాథ్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది.

వారి మాటల్లో భాగంగా హైదరాబాద్ లో సినిమా పరిశ్రమను ఇంకా అభివృద్ధి పరుస్తామని, తమ ప్రభుత్వం త్వరలోనే సినిమా పరిశ్రమ కోసం ఒక కొత్త పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

సీఎం కేసీఆర్ - కే. విశ్వనాథ్ మధ్య జరిగిన సంభాషణను సీఎం కార్యాలయం ప్రజలకు వెల్లడించింది. అది ఈ విధంగా ఉంది..

‘‘నేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచీ మీ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు తీసిన ప్రతీ సినిమా చూశా. శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటా. దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశా. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓ సారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. మీరు తీసే ప్రతీ సినిమా ఓ కావ్యంలాగా ఉంటుంది. మీరు సినిమాలను తపస్సుతో తీస్తారు. అందులో వాడే భాషగానీ, పాటలు గానీ, కళాకారుల ఎంపిక గానీ, సన్నివేశాల చిత్రీకరణ గానీ, సంభాషణలు గానీ ప్రతీదీ గొప్పగా ఉంటాయి. కుటుంబ మంతా కూర్చుని చూసేలా ఉంటాయి. అందుకే ఇప్పటికీ వీలు దొరికితే మీ సినిమాలు చూస్తాను. మీపై ఉన్న అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చింది. మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ సినిమాలు రాక పదేళ్లయింది. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడం లేదు. మీరు మళ్ళీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండి’’

అని ముఖ్యమంత్రి కోరారు.

‘‘మీరు అడుగు పెట్టడంతో మా ఇల్లు పావనమైంది. మీరే స్వయంగా మా ఇంటికి రావడం మా అదృష్టం. రాత్రి మీరు నాతో ఫోన్లో మాట్లాడి, ఇంటికి వస్తున్నానని చెబితే, ఎవరో గొంతు మార్చి మాట్లాడుతున్నారని అనుకున్నాను. మీరే మాట్లాడారని తేల్చుకున్నాక రాత్రి 12 గంటల వరకు నిద్ర పట్టలేదు. మీరు చేసే పనులను, ప్రజల కోసం తపించే మీ తత్వాన్ని టీవీల్లో, పత్రికల్లో చూస్తున్నాను. నేరుగా చూడడం ఇదే మొదటి సారి. చాలా సంతోషంగా ఉంది. గతంలో మీలాగే ఒకసారి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంజిఆర్ మాట్లాడారు. మళ్లీ మీ అంతటి వారు మా ఇంటికి రావడం నిజంగా సంతోషంగా ఉంది’’ అని విశ్వనాథ్ అన్నారు.

ఆరోగ్యం గురించి కేసీఆర్ వాకబు చేసిన సందర్భంగా తన సినిమాలకు సంబంధించి ఒక ఆస్తక్తికరమైన విషయాన్ని విశ్వనాథ్ పంచుకున్నారు.

‘‘ఆరోగ్యం బాగానే ఉంది. కానీ మోకాళ్ల నొప్పులున్నాయి. ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు అంటున్నారు. కానీ నాకు ఆపరేషన్ అంటే భయం. అసలు హాస్పిటల్ అంటేనే భయం. నా సినిమాల్లో కూడా ఎక్కడా ఆసుపత్రి సీన్లు పెట్టను. రక్తం అంటే భయం. ఇక నేనేమి ఆపరేషన్ చేయించుకుంటాను. ఇలాగే గడిపేస్తా’’ అని విశ్వనాథ్ చెప్పారు.

‘‘మీకు తెలుగు భాషపైనా, సాహిత్యంపైనా మంచి పట్టుంది. ప్రపంచ తెలుగు మహాసభలను గొప్పగా నిర్వహించారు. మీరు చక్కగా మాట్లాడతారు. మంచి కళాభిమాని కూడా’’ అంటూ విశ్వనాథ్ సీఎంను అభినందించారు. సాహిత్యాభిలాష ఎలా పుట్టిందని విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు, చిన్నప్పటి నుంచి తన గురువుల సాంగత్యం గురించి కేసీఆర్ వివరించారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా కట్టారు. రైతుల కష్టాలు తీరుతాయి. కాళేశ్వరం నీళ్లు వస్తున్నప్పుడు మీ కళ్లల్లో ఎంతో ఆనందం చూశాను. నిజంగా చాలా గొప్ప ప్రాజెక్టు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే మీ తపనంతా విజయవంతం అవుతుంది’’ అని విశ్వనాథ్ భార్య జయలక్ష్మి ముఖ్యమంత్రితో చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో పుష్కలమైన నీళ్లున్నాయని, వాటిని రెండు రాష్ట్రాలు మంచిగా వాడుకుంటే రెండు రాష్ట్రాల రైతులకు మేలు కలుగుతుందని, ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అదే పనిలో ఉన్నాయని కేసీఆర్ చెప్పారు.

మీరు చాలా కష్టపడి ప్రాజెక్టులు కడుతున్నారు, అయినా విమర్శలు తప్పడం లేదు, ఎలా భరిస్తున్నారు అని సీఎంను విశ్వానాథ్ అడిగారు. ‘‘రాజకీయాల్లో అన్నీ అలవాటైపోయాయి. తప్పదు కూడా. ప్రజల కోసం పనిచేస్తున్నామనే ఉద్దేశ్యంతో అవన్నీ పెద్దగా పట్టించుకోవడం లేదు. పని చేసుకుంటూ పోతున్నాను’’ అని కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రజల కోసం చేసే పనికి దైవ కృప ఉంటుంది. మీకు కూడా ఉంది అని విశ్వనాథ్ దీవించారు.