Hyderabad, Jan 28: తన మాజీ భార్య చంపబోతున్నదంటూ ప్రముఖ సినీ నటుడు నరేశ్ (Actor Naresh) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మూడో భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. సుపారీ గ్యాంగ్‌తో (Gang) కలిసి తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రూ.10 కోట్లు ఇవ్వాలని రమ్య తనను బెదిరించిందని, అందుకు తాను అంగీకరించకపోవడంతో సుపారీ గ్యాంగ్‌తో కలిసి హత్యకు (Murder) కుట్ర పన్నిందని పేర్కొన్నారు. తనను చంపేందుకు గతేడాది కొందరు రెక్కీ కూడా నిర్వహించారన్నారు. దీంతో ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. రమ్యతో తాను నరకయాతన అనుభవిస్తున్నట్టు చెబుతూ నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన ఫోన్‌ను హ్యాక్ చేయడంతో సైబర్ కోర్టులోనూ కేసు వేసినట్టు చెప్పారు.
నేడు రథసప్తమి.. భక్తజన సంద్రంగా అరసవల్లి.. గత రాత్రి నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు
నరేష్ 3 మార్చి 2010లో బెంగళూరులో రమ్యను మూడో వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో రూపాయి కూడా కట్నం తీసుకోలేదని నరేష్ తెలిపారు. తన తల్లి విజయనిర్మల ఆమెకు రూ. 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చేయించిపెట్టినట్టు చెప్పారు. పెళ్లయిన కొన్ని నెలల నుంచే తనకు వేధింపులు మొదలయ్యాయని, బెంగళూరులోనే ఉండాలని షరతు పెట్టిందని గుర్తు చేశారు. 2012లో తనకు రణ్‌వీర్ అనే బాబు జన్మించాడని, ఆ తర్వాత తనకు తెలియకుండానే బ్యాంకులతోపాటు కొంతమంది నుంచి డబ్బులు వసూలు చేసిందన్నారు. తన పేరు చెప్పి లక్షల్లో వసూలు చేయడంతోపాటు అవి తీర్చేందుకు రూ. 10 లక్షలు చెల్లించినట్టు తెలిపారు. ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల నుంచి రమ్య మరో రూ. 50 లక్షలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.
గతేడాది ఏప్రిల్‌లో కొందరు వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడ్డారని, రూ. 24 లక్షలు రికవరీ చేసేందుకు వచ్చామని మాయమాటలు చెప్పారని నరేష్ వివరించారు. ఈ ఘటనపై అప్పట్లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తాను డబ్బులు ఇవ్వకపోవడంతో తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డితోనూ తనకు ఫోన్ చేయించి బెదిరించిందని నరేష్ ఆరోపించారు. తనను చంపేస్తారన్న భయంతో ఒంటరిగా బయటకు వెళ్లడం లేదని ఆయన వాపోయారు.