గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించినా విధిని జయించలేక ఈ లోకాన్ని వీడిన విషయం విదితమే. ఆయన (SP Balasubrahmanyam) లేడని చిత్రసీమ తల్లడిల్లిపోయింది. పాటల రూపంలో ఆయన బతికే ఉన్నాడని ఎవరికి వారు ఓదార్చుకున్నారు. అయితే స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతిని (S P Balasubrahmanyam on his birth anniversary) పురస్కరించుకొని టాలీవుడ్ ఆయనకు ఘన నివాళి అందించబోతోంది. బాలు జయంతి రోజైన జూన్ 4వ తేదీన స్వరనీరాజనం పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలుగు సినిమాకే కాక భారతీయ సినిమాకి బాలు చేసిన సేవలను గుర్తు చేస్తూ టాలీవుడ్ ఆయనకు ఘన నివాళి అర్పించబోతోంది.
జూన్ 4న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేయబోతోంది. ఇందులో మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, నిర్మాతలు, సంగీత దర్శకులు, పాటల రచయితలు.. ఇలా సినీరంగానికి చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ చెప్పారు. నాన్ స్టాప్‌గా జరిగే ఈ ప్రోగ్రామ్‌ని చూసి అందరూ జయప్రదం చేయాల్సిందిగా ఆయన కోరారు. మెలోడిబ్రహ్మ మణిశర్మ బాలసుబ్రహ్మణ్యంపై స్వరపర్చిన ప్రత్యేక గీతాన్ని జూన్ 4న ఆవిష్కరించనున్నాం ‘ అని చెప్పారు.
ఈ కార్యక్రమంపై డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ ‘బాలూ గారి జయంతిని పురస్కరించుకుని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఆరోజుని బాలుగారికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. వారి గౌరవార్థం సినీ ప్రముఖులంతా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇది దాదాపు 12 గంటలపాటు లైవ్ ప్రోగ్రామ్ గా కొనసాగుతుందని అన్నారు.