తెలంగాణ బతుకమ్మ, గౌరమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జబర్దస్త్ నటుడు హైపర్ ఆది (Jabardasth comedian Hyper Aadi) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పాడు. ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు తమ షోలో ఎప్పుడు ఉండవు... అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఉంటామని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో చేసిన స్కిట్‌పై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం దీనిపై ఫోన్‌కాల్‌లో ఆ ప్రతినిధులకు వివరణ ఇచ్చారు.
అయితే బేషరతుగా క్షమాపణలు చెప్పేదాక తాము వదిలిపెట్టమని.. కావాల్సి వస్తే న్యాయపరంగా వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది క్షమాపణలు చెబుతూ రాత్రి వీడియో (Hyper Aadi Released Apology Video) విడుదల చేశారు. ఆ షోలో చేసిన స్కిట్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. అవి తాము కావాలని చేసినవి కావు అని హైపర్ ఆది తెలిపారు. అన్ని ప్రాంతాల వారి ప్రేమ, అభిమానంతోనే తాము వారికి వినోదం పంచుతున్నట్లు చెప్పారు. ఇటీవల షోలో జరిగిన దానికి అందరి తరఫున క్షమాపణ కోరుతున్నట్లు ప్రకటించాడు.
ఇదిలా ఉంటే ఆయన క్షమాపణలు చెప్పినా కూడా తాము వదిలేది లేదని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఆది క్షమాపణలు చెప్పిన అనంతరం ఆ సంస్థ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్ స్పందించారు. హైపర్ ఆదిని బాధపెట్టడం.. క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు అని తెలిపారు. సంస్కృతిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము ఆరోపణలు చేస్తున్నట్లు హైపర్ ఆది అనడం సిగ్గుచేటు అని నవీన్ గౌడ్ తెలిపారు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం ఈ వ్యాఖ్యలను గమనిస్తున్నారని చెప్పారు.
సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఎక్కడ కూడా మేము తగ్గేది లేదని.. కచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఏదో అతని పర్సనల్ పేజీలో వీడియో పెట్టుకొని చేతులు దులుపుకునే ధోరణి సహించేది లేదు అని పేర్కొన్నారు.