కోయిలమ్మ సీరియల్ హీరో అమర్ అలియాస్ సమీర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో అమర్‌పై (Actor Amar Shashank) రాయదుర్గం పోలీస్ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు అమర్‌ను బుధవారం అరెస్టు చేసి కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరచారు. కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో అమర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా ఈ కేసుపై పోలీసులు ( Raidurgam police) మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.
శ్రీ విద్య, స్వాతి, లక్ష్మి ఈ ముగ్గురూ కలిసి మణికొండలో బౌటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల స్వాతి బౌటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది. అయితే తనకు రావాల్సిన కుట్టు మెషిన్, డబ్బుల విషయంలో పార్టనర్స్ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వాతికి రావాల్సిన బకాయిలు శ్రీవిద్య ఇవ్వకపోవడంతో ఇటీవల స్వాతి తన భాయ్‌ఫ్రెండ్ కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్‌తో కలిసి శ్రీ విద్య ఇంటికి వెళ్లి నిలదీశారు.
మాటా మాటా పెరిగి గొడవకు దారి తీయడంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దాంతో అమర్ అలియాస్ సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే అమర్, స్వాతిలు కూడా కౌంటర్ కేసు పెట్టారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ‘కోయిలమ్మ’ సీరియల్ నటుడు అమర్ అలియాస్ సమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం మీడియాతో మాట్లాడిన అమర్.. ‘‘ఆ రోజు నేను తాగి వెళ్లలేదు. బ్లడ్ రిపోర్ట్స్ కూడా నెగెటివ్గానే వచ్చాయి. నిజానికి, కావాలనే నాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ రోజు గొడవ పడిన వీడియో లో కేవలం 2 నిమిషాలు మాత్రమే బయటికి రిలీజ్ చేశారు.
అందులో ఉన్న వాళ్లందరూ మా స్నేహితులే. ఎఫ్‌ఐఆర్ కాపీలో సైతం నేను లైంగిక వేధింపులకు పాల్పడలేదనే ఉంది. నా గురించి అసత్యాలు ప్రచారం చేసిన వారిపై నేను కూడా కేసు పెడతాను. నేను రూ. 5 లక్షలు తీసుకున్నట్టు ఆధారాలు చూపించాలి. కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది. మీడియాలో కూడా నేను గొడవ పడుతున్నట్టు చూపించారు. అంతకు ముందు నుంచే గొడవ జరిగింది దాన్ని మాత్రం చూపించలేదు’’ అని చెప్పుకొచ్చాడు