New Delhi,October 18: అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె ( All India Bank Strike)బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా వీరంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే వారంతా బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు. అక్టోబర్ 22న సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ ఖాతాదారులపై ఈ ప్రభావం పడనుంది. కాగా పది ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి 4 బ్యాంకులుగా మార్చాలనే ప్రధాని మోడీ ప్రభుత్వపు నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె బాట పడుతున్నట్లు బ్యాంక్ యూనియన్లు చెబుతున్నాయి. ఈ సమ్మెలో ఏకంగా 2 లక్షలకు పైగా బ్యాంక్ ఉద్యోగులు పాల్గొనవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
విలీన ప్రక్రియ ప్రైవేటీకరణకు దారితీస్తుందని, అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (Bank Employees Federation of India)తెలిపింది. అందుకే సమ్మెలోకి దిగుతున్నామని పేర్కొంది. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కూడా సమ్మెకు మద్దతు తెలిపింది.
బ్యాంకుల విలీనం వల్ల పెద్ద సంఖ్యలో బ్రాంచులు మూతపడతాయని తద్వారా స్టాఫ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందని, అప్పుడు ఉద్యోగాల కోత ప్రారంభమవుతుందని బీఈఎఫ్ఐ తెలిపింది. వీరి ప్రభుత్వం ముందు అనేక డిమాండ్లను ఉంచారు. మొండి బకాయిలను వసూలు చేయడం, డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడం, కస్టమర్లపై చార్జీల బాదుడు తగ్గింపు వంటి పలు అంశాలను కూడా యూనియన్లు వాటి డిమాండ్లలో చేర్చాయి. ఈ విలీన చర్యను కేంద్ర ప్రభుత్వ విఘాతమైన చర్యగా ఉద్యోగులు అభివర్ణిస్తున్నారు. 10 బ్యాంకులు 4 బ్యాంకులగా విలీనమైతే ప్రభుత్వ రంగం బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 తగ్గిపోతుందన్నారు.