New Delhi, December 3: సాధారణంగా జనరల్ టికెట్లు (General Ticket) తీసుకున్న వారు సీటు దొరక్క నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసం భారతీయ రైల్వే(Indian Railway) అదిరిపోయే శుభవార్తను అందించింది. ఇకపై మీరు జనరల్ టికెట్లు తీసుకున్నా మీకు సీటు కన్ఫామ్ అవుతుంది. భారతీయ రైల్వే ప్రయోగాత్మకంగా ఈ కొత్త సర్వీసును ప్రవేశపెడుతోంది. జనరల్ కంపార్ట్‌మెంట్ టికెట్లు తీసుకున్నవారికి కూడా కన్ఫామ్డ్ టికెట్లు ఇచ్చేందుకు భారతీయ రైల్వే ఈ సర్వీసును ప్రారంభించింది.
మీరు టికెట్ తీసుకోగానే సీటుకు సంబంధించిన నంబర్ మెసేజ్ రూపంలో మీ వాట్సప్(Whatsapp)కు వస్తుంది. మీరు రైలు ఎక్కగానే మీకు కేటాయించిన సీటులో కూర్చోవచ్చు. ప్లాట్‌ఫామ్‌పై క్యూ తగ్గించడంతో పాటు, అక్రమాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని రూపొందించింది.
ఇండియన్ రైల్వే 'పాస్ ఫర్ అన్‌రివార్డెడ్ బోర్డ్-PURB' (Pass for Unrewarded Board)పేరుతో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో దానాపూర్ డివిజన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఇక్కడ కొంతకాలం పరిశీలించిన తర్వాత సక్సెస్ అయితే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సర్వీస్‌ను అమలు చేస్తుంది. ప్రయోగం విజయవంతమయితే జనరల్ కోచ్‌లల్లో అన్‌రిజర్వ్‌డ్ సీట్లను కూడా కన్ఫామ్ చేసి ప్రయాణికులకు అందిస్తుంది.