AP EX CM, TDP Chief Chandrababu Naidu | (File image)

Amaravati, February 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 2018-19 ఆర్థిక సంవత్సరానికి తన ఆస్తులను మరియు కుటుంబ ఆస్తులను (Assets) ప్రకటించారు. డిక్లరేషన్ ప్రకారం, చంద్రబాబు తన ఐదేళ్ల మనవడు నారా దేవాన్ష్ కంటే ఎన్నో రేట్లు పేదవాడు. 2019 మార్చి 31 నాటికి దేవాన్ష్ రూ .19.42 కోట్ల ఆస్తులను కలిగి ఉండగా, 14 ఏళ్లు సీఏంగా వ్యవహరించిన చంద్రబాబు ఆస్తులు మాత్రం రూ. 3.87 కోట్లకు మించలేదు. అయితే సీఎం పదవి పోయిన తర్వాత చంద్రబాబు బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 70 లక్షలు పెరిగి ప్రస్తుతం 74.10 లక్షలుగా ఉంది, అంతకుముందు కేవలం రూ. 10 లక్షలు మాత్రమే ఆయన ఖాతాలో ఉండేవి.

ఇక ఇప్పటికీ చంద్రబాబు పేరు మీద ఉన్న కారు 1993లో కొన్నప్పటి అంబాసిడర్ మాత్రమే.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తుల విషయానికి వస్తే, 3.5 కిలోల బంగారు ఆభరణాలు మరియు 42 కిలోల వెండి ఉంది. హెరిటేజ్ ఫుడ్ లో సుమారు రూ. 20 కోట్ల వరకు విలువ చేసే లక్షకు పైగా షేర్లు కలిగి ఉన్నారు. నికరంగా ఆమె ఆస్తుల విలువ రూ. 39.58 కోట్లు

ఇక లోకేశ్ విషయానికి వస్తే, ఆయన పేరిట రెండు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఫార్చూనర్ కార్లు, ఒక ఫోర్డ్ ఫిఎస్టా కారు, ఈ మూడిండి విలువ రూ. 92 లక్షలు. హైదరాబాద్‌లోని జుబ్లీ హిల్స్ ప్రాంతంలో తండ్రి వాటాతో కలిపి నిర్మించిన ఒక ఇల్లు ఉంది దాని విలువ రూ. 10.35 కోట్లు. మదీనాగూడలో అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చిన 5 ఎకరాల వ్యవస్యాయ భూమి ఉంది. ఇది గిఫ్ట్ కాబట్టి దీని విలువ లోకేశ్ పేర్కొనలేదు. మొత్తంగా లోకేశ్ నికర ఆస్తులు రూ. 19 కోట్లు.

లోకేశ్ సతీమణి బ్రాహ్మణి ఆస్తుల విషయానికి వస్తే, ఆమె వద్ద 2.5 కిలోల బంగారు ఆభరణాలు, మాధాపూర్, జూబ్లీహిల్స్, మణికొండ ప్రాంతాల్లో ప్లాట్లు, హెరిటేజ్ ఫుడ్స్ లో షేర్స్ కలిగి ఉన్నారు. అప్పులు తీసివేసి, నికరంగా ఉన్న ఆస్తుల విలువ రూ.11.51 కోట్లు.

ఇక మొత్తంగా చంద్రబాబు కుటుంబ ఆస్తులు గతేడాదితో పోలిస్తే రూ. 13 కోట్ల మేర పెరిగి ప్రస్తుతం రూ. 102.49 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. ఈ ప్రకారం, నారా కుటుంబంలో అందరికంటే తక్కువ ఆస్తులు, అందరికంటే పేదవాడు చంద్రబాబే కావడం గమనార్హం.

చంద్రబాబు ఆస్తుల ప్రకటననే ఒక ప్రహాసనం అని, ఇవన్నీ బూటకపు లెక్కలనీ ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టిన ఆయన తన ఆస్తుల వివరాలను ప్రకటించడం ఇది తొమ్మిదో సారి.

గురువారం తమ కుటుంబ ఆస్తులకు సంబంధించి ఈ వివరాలను విల్లడించిన నారా లోకేశ్, ఇవే తమ ఆస్తులు అని తేల్చి చెప్పారు. ఇంతకంటే ఒక్క గజం, లేదా ఒక్క రూపాయి ఎక్కువ చూపినా, తమ ఆస్తులన్నీ వారికే రాసిస్తామని లోకేశ్ ప్రతిపక్షాలకు సవాల్ పిసిరారు.