బీటెక్ కోర్సులను ఇక ఎంచక్కా ప్రాంతీయ భాషల్లో చదివేయండి. తెలుగు సహా హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాళీ, పంజాబీ, ఒడియా, అస్సామీ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు (BTech Programs in Regional Languages) అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న తెలిపారు. ప్రాంతీయ భాషల్లో విద్యా విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ (PM Modi) కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.
మొదటి దశలో ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కోర్సులను (BTech Programs in 11 Regional Languages) బోధించనున్నారు. ఇందుకోసం ఇంజనీరింగ్ కోర్సులను ఏఐసీటీఈ ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తున్నది. మొత్తం 11 భాషల్లోకి కోర్సులను ట్రాన్సిలెట్ చేస్తున్నారు. భాష కారణంగా ఏ విద్యార్థి కూడా తాను కోరుకొన్న చదువుకు దూరం కాకూడదని.. ఇంజనీరింగ్ సహా అన్ని ఉన్నత విద్య కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించాలని జాతీయ విద్యా విధానంలో(NEP) పేర్కొన్నారు.
ఈ ఏడాది మొదట్లో ఏఐసీటీఈ (AICTE) సర్వే నిర్వహించగా దాదాపు సగం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తాము మాతృభాషలో చదవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం ప్రాంతీయభాషలో ఇంజనీరింగ్ కోర్సుల బోధనపై ప్రొఫెసర్ ప్రేమ్ విరాట్ అధ్యక్షతన కమిటీ వేశారు. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఏఐసీటీఈ అనుబంధ కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో కోర్సులను ఎంచుకోవడానికి విద్యార్థులకు ఆప్షన్ ఉండాలని ఈ కమిటీ సూచించింది.
ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో 14 కాలేజీలు ఆసక్తిచూపాయి. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనకు ఏఐసీటీఈ కాలేజీలకు అనుమతినిచ్చింది. విద్యార్థులు ప్రాంతీయ భాషల్లో కోర్సులు చేస్తున్నప్పటికీ ఈ నాలుగేండ్లు వారికి ఇంగ్లిషు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుంది. ఫ్యాకల్టీని బట్టి కాలేజీలు భిన్న భాషల్లో కోర్సులను అందించవచ్చు. ప్రాంతీయ భాషల్లో కోర్సులను అందించాలంటే కాలేజీకి ఎన్‌బీఏ గుర్తింపు ఉండాలి.