Students | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, June 17:  సిబిఎస్‌ఇ 12 వ తరగతి ఫలితాలను జూలై 31 లోగా ప్రకటిస్తామని ఈరోజు సుప్రీంకోర్టుకు సిబిఎస్‌ఇ బోర్డు తెలిపింది. ఈ ఫలితాలకు సంబంధించిన మూల్యాంకన ప్రమాణాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించింది. గత మూడేళ్లుగా విద్యార్థుల కనబర్చిన ప్రతిభ లేదా 10వ తరగతి నుంచి విద్యార్థులకు సంపాదించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని జూలై 31 లోగా ఫలితాలు ప్రకటించనున్నట్లు కోర్టుకు తెలిపింది.

10వ తరగతి ఫైనల్ ఫలితాల ఆధారంగా 11వ తరగతి, అలాగే 11వ తరగతి ఫైనల్ ఫలితాల ఆధారంగా 12వ తరగతి ఫలితాలను నిర్ణయించనున్నట్లు బోర్డు తెలిపింది. ప్రీ-బోర్డ్ పరీక్షల్లో 10వ తరగతికి మార్కులకు 30 శాతం వెయిటేజీ, 11వ తరగతి ఫలితాలకు 30 శాతం వెయిటేజీ మరియు 12వ తరగతికి 40 శాతం వెయిటేజీ ఇచ్చి మార్కులను కేటాయించనున్నట్లు తెలిపారు.

12వ పరీక్షలలో పాఠశాల గత పనితీరు ఆధారంగా మొత్తం మార్కులు లభిస్తాయని, ప్రాక్టికల్స్ లలో పాఠశాలలు తమ విద్యార్థులకు ఇచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా విద్యార్థి అర్హత ప్రమాణాలను అందుకోలేకపోతే వారు " ఎసెన్షియల్ రిపీట్" లేదా "కంపార్ట్మెంట్ " విభాగంలో ఉంచబడతారు. అయితే ఈ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు పరిస్థితులు అనుకూలించాక బోర్డు నిర్వహించే పరీక్షలకు హాజరు కావచ్చునని కేంద్రం స్పష్టం చేసింది.

ఇక 12 ఫలితాల కోసం సిబిఎస్‌ఇ ప్రతిపాదించిన ఈ 30:30:40 ఫార్ములాకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.

దేశంలో సెకండ్ వేవ్ కరోనా ఉధృతి నేపథ్యంలో సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షలను జూన్ 1న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.