New Delhi, May 23: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను (CBSE Class 12th Board Exams 2021) నిర్వహించడానికే కేంద్రం మొగ్గు చూపింది. ఇందుకు సంబంధించి రెండు విధి విధానాలను పరిశీలిస్తోంది. ఆ వివరాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీబీఎస్‌ఈ (CBSE) తెలియజేసింది. అయితే దీనిపై ఇంకా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. సెకండ్‌వేవ్ విజృంభణతో ఈ పరీక్షలు వాయిదా వేస్తారని ప్రచారం జరిగింది. అయితే పరీక్షల నిర్వాహణకే సీబీఎస్‌ఈ మొగ్గు చూపింది.
పరీక్షలు నిర్వహణపై ఆదివారం కేంద్ర మంత్రుల కమిటీ భేటీ అయ్యింది. ఈ భేటీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విద్యాశాఖా మంత్రి పోఖ్రియాల్‌తో (Education Minister Ramesh Pokhriyal Nishank) పాటు అన్ని రాష్ట్రాల విద్యాశాఖా మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షల నిర్వహణకే వీరందరూ మొగ్గు చూపారు.
జూలైలో పరీక్షలు నిర్వహించడానికి బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖా మంత్రి రమేశ్ పోఖ్రియాల్ జూన్ ఒకటో తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు సీబీఎస్‌ఈ రెండు పద్ధతులను ఉంచింది. అందులో మొదటిది పరీక్షల పద్ధతిని పూర్తిగా మార్చేయడం. కేవలం 1 గంటా 50 నిమిషాల వరకే పరీక్షను నిర్వహించాలని సూచించింది. ఇక రెండో పద్ధతి ఏంటంటే.. కేవలం ముఖ్యమైన సబ్జెక్టులపైనే పరీక్షలు నిర్వహించడం. మిగిలిన సబ్జెక్టుల విషయంలో ఇంటర్నల్ అసైన్‌మెంట్ ఆధారంగా మార్కులు నిర్ణయించండం.
మొదటి పద్దతి : మూడు నెలల్లో
12 తరగతి పరీక్షలు నిర్వహించేందుకు రెండు పద్దతులను కేంద్రం ముందు ఉంచింది సీబీఎస్‌ఈ. ఇందులో మొదటి పద్దతి ప్రకారం పరీక్షల ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి నెలలో ప్రీ ఎగ్జామ్స్ యాక్టివిటీస్, రెండో నెలలో పరీక్షల నిర్వహించడం, మూడో నెలలో ఫలితాలు వెల్లడి వంటివి ఉంటాయి. అయితే పరీక్షలు ప్రధాన సబ్జెక్టులకే నిర్వహిస్తారు. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా మిగిలిన సబ్జెక్టుల్లో మార్కులు కేటాయిస్తారు. దీని ప్రకారం జూన్‌లో పరీక్షా తేదీలను ప్రకటించి జులైలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
రెండో పద్దతి: నాలుగు సబ్జెక్టులే
ఇక రెండో ఆప్షన్ ప్రకారం పరీక్షా సమయాన్ని కేవలం 90 నిమిషాలకు కుదించి 4 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఒకటి కచ్చితంగా భాషకు సంబంధించి అయి ఉండాలి. మిగిలిన మూడు సబ్జెక్టులను విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. మొత్తంగా విద్యార్థులు నాలుగు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగా మిగిలిన రెండు సబ్జెక్టులకు మార్కులు కేటాయిస్తారు.
అన్ని రాష్ట్రాలు తమ తమ అభిప్రాయాలను వారం రోజుల వ్యవధిలో కేంద్రానికి తెలపాల్సి ఉంటుంది. పరీక్షలు ఏ ఫార్మెట్ ప్రకారం జరుగుతాయి? ఎప్పుడు జరుగుతాయి? విధి విధానాలపై కేంద్ర విద్యామంత్రి రమేశ్ ప్రోక్రియాల్ జూన్ 1న అధికారికంగా వెల్లడిస్తారు.