TS ICET 2022: టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేష‌న్‌ విడుదల, ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు, జులై 27, 28 తేదీల్లో ఐసెట్ ప‌రీక్ష
Representational Image | File Photo

తెలంగాణ వ్యాప్తంగా టీఎస్ ఐసెట్-2022 నోటిఫికేష‌న్‌ను కాక‌తీయ విశ్వవిద్యాల‌యం బుధ‌వారం విడుద‌ల (TS ICET 2022) చేసింది. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. రూ. 250 అప‌రాధ రుసుంతో జులై 11వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. జులై 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐసెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఆగ‌స్టు 4న ఐసెట్ ప్రాథ‌మిక కీ, ఆగ‌స్టు 22న తుది ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.

ఇది వరకే టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేష‌న్‌ను ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను (TS EAMCET 2022) స్వీక‌రిస్తారమని కన్వీనర్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 400, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 800 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని కన్వీనర్ తెలిపారు. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 800, మిగ‌తా కేట‌గిరిల అభ్య‌ర్థులు రూ. 1600 చెల్లించి, ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు (TS EAMCET 2022 notification ) చేసుకోవాలన్నారు.

అగ్రిక‌ల్చ‌ర్, మెడిక‌ల్ పరీక్షను జూన్ 14, 15వ తేదీల్లో, నిర్వహిస్తామన్నారు. ఇంజినీరింగ్ ఎగ్జామ్‌ను 18, 19, 20వ తేదీల్లో నిర్వహిస్తామని కన్వీనర్ పేర్కొన్నారు. ఎంసెట్ పరీక్షలు 28 ప్రాంతీయ సెంటర్లలో 105 కేంద్రాల్లో జరపనున్నారు. అందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈసారి ఎంసెట్ పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోపే ర్యాంకులు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజి ఎంసెట్ కు ఉండదన్న సంగతి తెలిసిందే.