Hyd, May 10: తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు.
ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 4,84,370 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కాగా మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించి, ఫలితాల విడుదలకు ఆమోదం తెలిపిన సంగతి విదితమే. కాగా, విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.
పదోతరగతి ఫలితాల్లో 86.6శాతం ఉతీర్ణత నమోదయింది. బాలికలు 88.53 శాతం ఉతీర్ణత సాధించగా, బాలురు 84.68 శాతం ఉతీర్ణత సాధించారు. 99 శాతం ఉతీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ లో నిలవగా అట్టడుగును వికారాబాద్ జిల్లా నిలిచింది. వికారాబాద్ జిల్లాలో 59.46శాతం ఉతీర్ణత నమోదయింది.
2793 స్కూళ్లు వందశాతం ఉతీర్ణత సాధించాయి. 25 స్కూళ్లు జీరోశాతం ఉతీర్ణత నమోదయింది. జూన్ 14 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి సబితా రిక్వెస్ట్ చేశారు. మళ్లీ పరీక్షలు రాసి పాస్ కావాలని సూచించారు.