జమ్మికుంట, డిసెంబర్ 9: ధాన్యం కొనుగోలు కేంద్రంలో (Paddy Procurement Centre) గుండెపోటుతో రైతు మృతి (Farmer Died) చెందిన ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతు బిట్ల ఐలయ్య (65) తాను పండించిన ధాన్యాన్ని నెల రోజుల క్రితం తీసుకువచ్చాడు. ధాన్యం తేమగా ఉండటంతో అధికారులు కొనుగోలు చేయలేదు. దీంతో రోజూ అక్కడికి వచ్చి ధాన్యాన్ని ఆరబోసుకొని కొనుగోలు చేయాలని సింగిల్ విండో అధికారులను కోరుతూ వచ్చాడు. రోజూలాగే కొనుగోలు కేంద్రానికి వచ్చిన ఐలయ్య ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు మృతదేహానికి శవపరీక్ష నిర్వహించవద్దని కుటుంబసభ్యులు వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం అధికారులు, పోలీసుల జోక్యంతో మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న హుజురాబాద్ ఆర్‌డిఒ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతోనే తన భర్త మృతి చెందాడంటూ ఐలయ్య భార్య లక్ష్మీ ఆర్‌డిఒ ఎదుట వాపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జమ్మికుంట సిఐ రామచందర్ రావు తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రంలో గుండెపోటుతో మరణించిన రైతు బిట్ల ఐలయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బిజెపి నాయకులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 20 రోజుల క్రితం వరి కోసి కల్లంలో వడ్లను ఆరబోసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయని కారణంగా మనస్థాపం చెందిన రైతు కల్లం వద్దే తనువు చాలించాడన్నారు. రైతు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఈటల రాజేందర్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.