Shane Warne Dies: ఒక్కసారిగా నివ్వెరపోయిన క్రికెట్ ప్రపంచం, గుండెపోటుతో ఉన్నచోటనే కుప్పకూలిన వార్న్, 37 సార్లు 5 వికెట్లు, టెస్టుల్లో ప‌ది సార్లు 10 వికెట్లు, షేన్‌ వార్న్‌ జీవిత ప్రస్థానం ఇదే..
Shane Warne (Photo Credits: Instagram)

ఆస్ట్రేలియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్ తన విల్లాలో అచేతనంగా (Suspected Heart Attack) పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు (Former Australia Spinner Shane Warne Dies) డాక్టర్లు నిర్ధారించారు.

వార్న్ మరణ వార్త తెలిసి.. క్రికెట్ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్ దిగ్భ్రాంతి గురవుతున్నారు. వార్న్ థాయిలాండ్‌లోని ఓ విల్లాలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కుప్పకూలిన వార్న్‌ను బతికించేందుకు మెడికల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకడిగా పేరు గాంచిన వార్న్ (Shane Warne) ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్లనే తన బౌలింగుతో ముప్పుతిప్పలు పెట్టాడు. మేటి స్పిన్నర్‌గా పేరుపొందిన షేన్‌ వార్న్‌ ఆస్ట్రేలియా తరపున 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 1992-2007 మధ్య కాలంలో వార్న్ 145 టెస్టులు, 194 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 1001 వికెట్లు తీసుకున్నాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన వార్న్ వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టగా, టెస్టుల్లో 708 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో ప‌ది సార్లు 10 వికెట్లు పడగొట్టారు.

క్రికెట్ ప్రపంచంలో మరో విషాదం, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రాడ్ మార్ష్ గుండెపోటుతో కన్నుమూత

సమకాలీన క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్‌ వార్న్‌ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇక క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు షేన్‌ వార్న్‌ సొంతం. అనూహ్యంగా బంతి తిప్పడంలో మేటి అయిన వార్న్‌.. 2013లో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా నిలిచాడు. 1999 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో వార్న్‌ సభ్యుడిగా ఉన్నాడు.

క్రికెట్ లో ఓ బ్యాట్స్ మన్ సెంచరీ చేస్తే గొప్పగా భావిస్తారు. అదే ఓ బౌలర్ 5 వికెట్లు తీస్తే అది సెంచరీతో సమానం. అలాంటిది వార్న్ ఏకంగా 37 సార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. 2013లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు షేన్ వార్న్ వీడ్కోలు ప‌లికారు. 1994లో విజ్డెన్ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా షేన్ వార్న్ ఎంపిక‌య్యారు.

ఇండియన్ ప్రీమియర్‌లోనూ ఆడిన వార్నర్ 57 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి తొలి సీజన్‌లో జట్టుకు ట్రోఫీని అందించిపెట్టాడు. టెస్టుల్లో పదిసార్లు పదికి పది వికెట్లు పడగొట్టి అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా, ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం మైక్ గ్యాటింగ్ కు లెగ్ స్టంప్ కు ఆవల బంతిని వేసి అతడి ఆఫ్ స్టంప్ ను గిరాటేయడం ఇప్పటికీ క్రికెట్ ప్రేమికుల మదిలో కదలాడుతూనే ఉంటుంది. ఈ శతాబ్దపు అత్యుత్తమ బంతిగా ఆ డెలివరీ గురించి చెప్పుకుంటారు.

షేన్ వార్న్ మరణవార్తతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపపోయింది. ఈ వార్తను తాను నమ్మలేకపోతున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. జీవితమంటే ఇంతేనని, దానిని అర్థం చేసుకోవడం కష్టమన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నాడు. రిటైర్మెంట్ తర్వాత వార్న్ కోచ్‌గా అవతారమెత్తాడు. అలాగే, కామెంటేటర్‌గా, టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్‌గా మారి ఐదేళ్లుగా చాలా చురుగ్గా ఉన్నాడు. అంతలోనే అతడి మరణవార్త క్రికెట్ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టేసింది.

ఆస్ట్రేలియా క్రికెట్ లో ఇవాళ రెండు విషాద ఘటనలు జరిగాయి. ఈ ఉదయం ఆసీస్ వికెట్ కీపింగ్ దిగ్గజం రాడ్నీ మార్ష్ కన్నుమూశారు. మార్ష్ తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మార్ష్ మృతికి సంతాపసూచకంగా... పాకిస్థాన్ తో తొలి టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు కట్టుకుని బరిలో దిగారు. ఇప్పుడు లెగ్ స్పిన్ దిగ్గజం వార్న్ మరణంతో ఆస్ట్రేలియన్ క్రికెట్ నిర్ఘాంతపోయింది. కాగా షేన్ వార్న్.. 2021లో క‌రోనా బారిన ప‌డి త‌ర్వాత కోలుకున్నారు.