Haryana Assembly Election: PM Modi slams Congress on issue of Article 370 (Photo-ANI)

Chandigarh, October 19: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వార్ మరింతగా వేడెక్కుతోంది. బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటల యుధ్దం నడుస్తోంది. హర్యానా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న విమర్శలపై ప్రధాని మోడీ ఘాటుగా స్పందించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మోడీ మాట్లాడుతూ పొరుగుదేశం పాకిస్తాన్‌ భారత వ్యతిరేకతను అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు వాడుకుందన్నారు.

ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌కు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ వంటి పార్టీలు ప్రజల సెంటిమెంట్లను అర్థం చేసుకోలేవని, అలాగే దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలను గౌరవించలేవని వ్యాఖ్యానించారు.

మోడీ విమర్శల వర్షం

ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన ఆగస్టు 5వ తేదీనుంచి కాంగ్రెస్‌ పార్టీ బాధలో ఉందన్నారు. ఆ పార్టీ, అలాంటి ఇతర పార్టీలు ఆ రోజు నుంచి చికిత్స లేని జబ్బుతో బాధపడుతున్నాయని వ్యాఖ్యానించారు.70 ఏళ్లుగా జమ్మూకశ్మీర్, లదాఖ్‌ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆర్టికల్‌ 370ని తొలగించి వేశామని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్, సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి మేం మాట్లాడితే వారికి కడుపులో నొప్పి. బాలాకోట్‌ పేరెత్తితే ఇంకా ఆ నొప్పి మరింతగా పెరుగుతుంది’ అని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. మీరు మోడీని వ్యతిరేకించండి. ఆయనపై ఎన్నైనా ఆరోపణలు చేయండి. ఎన్ని అబద్ధాలనైనా ప్రచారం చేయండి. ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ఆ దూషణలు నన్నేం చేయలేవన్నారు. మోడీని ఎంతైనా తిట్టండి.. కానీ భారతమాతను గౌరవించండి, దేశానికి నష్టం కలిగేలా వ్యవహరించకండి అని ఈ సంధర్భంగా కాంగ్రెస్‌ను కోరారు.

కాంగ్రెస్ నొప్పితో బాధపడుతోంది: ప్రధాని మోడీ

కాంగ్రెస్‌పై ప్రధాని మరిన్ని విమర్శలు చేస్తూ, వ్యవసాయం, క్రీడల్లోనూ కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని తప్పుపట్టారు. 'కాంగ్రెస్ అవకతవకల పాలనలో జవాన్లు కానీ, రైతులు కానీ క్రీడాకారులు కానీ ఎవరూ సురక్షితంగా లేరు' అని అన్నారు. సోనిపట్ జిల్లాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ప్రతిరంగంలోనూ భారతదేశం గర్వించే ప్రాంతమిదని, అవి కుస్తీలు కావచ్చు, ఉగ్రవాదంపై పోరుకావచ్చు, దేశమంతా గర్విస్తోందని అన్నారు. సోనిపట్ అంటే 'కిసాన్, జవాన్, పెహల్వాన్' అని అభివర్ణించారు.

కాగా మహారాష్ట్ర, హర్యానా శాసన సభల ఎన్నికల పోలింగ్ ఈ నెల 21న జరుగుతుంది, ఓట్ల లెక్కింపు ఈ నెల 24న జరుగుతుంది.