IAS Officer Alleges Harassment: సొంత కార్యాలయంలోనే మహిళా ఐఏఎస్ ఆఫీసర్‌కి వేధింపులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ట్వీట్, స్పందించిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌
I face misbehavior, violation of my space by men in office (photo-twitter)

New Delhi, September 27:  పనిచేసే చోట మహిళలు వేధింపులకు గురి అవుతున్నారంటూ.. ఈ మధ్య అనేకమంది మహిళలు తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వేధింపులు సాధారణ మహిళలకే కాదు.. అత్యున్నత ఆఫీసర్లకి కూడా తప్పడం లేదు. సామాన్యుల సంగతి అలా ఉంచితే సాక్షాత్తూ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ తన సొంత కార్యాలయంలోనే వేధింపులకు గురి అయింది.ఈ మేరకు ఢిల్లీకి చెందిన మహిళా ఐఏస్ అధికారిణి మగవాళ్లను నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లుగా సోషల్‌ మీడియాలో సంచలన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. తన సొంత కార్యాలయంలో, తన చాంబర్‌లోని మగవాళ్లు తనపట్ల అనుచితంగా వ్యవహరించారంటూ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వర్షా జోషీ(Commissioner of Municipal Corporation of Delhi) సంచలన ఆరోపణలు చేశారు. తన కార్యాలయంలో కొందరు మగవాళ్లు పరిధికి మించి ప్రవర్తించారంటూ వర్షా జోషీ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వైరల్  అవుతున్న ట్వీట్

ఓ మహిళ ఆకతాయిల నుంచి ఎదుర్కుంటున్న వేధింపులు, ఎగతాళి వ్యాఖ్యలకు సంబంధించి తన బాధను ట్విట్టర్ ద్వారా వర్షా జోషి (Varsha Joshi) దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ట్వీట్ కి రిప్లయి ఇస్తూ వర్షా జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ మహిళ ‘ఈ వీధి గుండా వెళ్లడం ఏ మహిళకైనా చాలా కష్టం. ఇక్కడ కూర్చొని ఉన్న పురుషులు రోజంతా అదే పనిగా మహిళలను చూస్తూ.. హుక్కా పీలుస్తూ.. పేకాట ఆడుతూ మహిళలను వేధిస్తూనే ఉంటారు. ఈ విషయం గురించి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోట్లేదని, దయచేసి మీరైనా దీనిపై చర్య తీసుకోండి’అని ఓ మహిళ వర్షా జోషికి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

మహిళ చేసిన ట్వీట్

దీనికి మహిళా ఐఏస్ ఆఫీసర్ వర్షా జోషి రిప్లయి ఇస్తూ..‘నిజానికి పోలీసులు చర్య తీసుకోవాల్సిన అంశమే కానీ. ఉత్తర భారతదేశమంతా నిరంతరం మహిళలు ఈ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నా ఆఫీస్‌ చాంబర్‌లోనే నేను అసభ్య ప్రవర్తనను ఎదుర్కొన్నాను. పురుషులు తమ పరిధికి మించి ప్రవర్తించారు. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నదీ వారికే అర్థం కాలేదు. దీనికి పరిష్కారాలు ఏమున్నాయి’ అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా మహిళలు పని చేసే ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న వేధింపులను చాటుతున్న ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ట్వీట్‌పై స్పందించిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ జయప్రకాశ్‌...ఆమె ఎందుకు ఇలా ట్వీట్‌ చేయాల్సి వచ్చిందో తెలియదని, ఈ విషయమై వర్షా జోషితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం మహిళలకు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.